సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు ప్రతిసారీ వర్షాకాలపు కష్టాలు తీరడం లేదు. ప్రతియేటా వర్షాకాలంలోపునే సమస్యలు లేకుండా చేస్తామని హామీనిస్తున్న బల్దియా యంత్రాంగం వివిధ కారణాలతో ఆ పనుల్ని పూర్తిచేయలేకపోతోంది. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారీ అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, వాహనాలు, ప్రజలు ముందుకు కదల్లేక గంటల తరబడి ఆగిపోవాల్సి వస్తోంది. ఈ సారి కూడా అవే దృశ్యాలు పునరావృతం కానున్నాయి. ఈ వారంలో రెండు రోజులు కొద్దిసేపు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితిని హెచ్చరించాయి. నగరంలో దాదాపు 150 నీటిముంపు ప్రాంతాలుండగా వాటి శాశ్వత పరిష్కారం కోసం దశలవారీగా పనులు చేపడుతున్నారు. అయితే చాలాచోట్ల పూర్తికాని పనుల వల్ల సమస్యలు పునరావృతమవుతున్నాయి. గతంలో దీప్తిశ్రీనగర్ వంటి ప్రాంతాల్లో రోజుల తరబడి ఇళ్లు నీళ్లలోనే మునిగి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు.
దీప్తిశ్రీనగర్‌తోపాటు పీజేఎన్ ఎన్‌క్లేవ్, గంగారం చెరువు ప్రాంతాల్లో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. నాలాలకు సంబంధించి 47 బాటిల్‌నెక్ ప్రాంతాల్లో 840 ఆక్రమణల్ని తొలగించాల్సి ఉండగా, దాదాపు 500 వరకు తొలగించారు. నగరం ముంపునకు ప్రధాన కారణం నాలాల విస్తరణ జరగకపోవడం. అందుకు ఆస్తుల సేకరణ, ఆక్రమణల తొలగింపు వంటివి ఆటంకాలుగా మారాయి. నగరంలో జూలై తర్వాతే వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, అప్పటిలోగా మేజర్ పనుల్ని పూర్తిచేస్తామని చెబుతున్నారు. కానీ పూర్తయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికీ ఖైరతాబాద్, పంజగుట్ట మోడల్‌హౌస్, మెహదీపట్నం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, రాణిగంజ్, ఎస్పీరోడ్, హిమాయత్‌నగర్, చే నెంబర్, మహబూబ్‌మాన్షన్ వంటి తీవ్ర సమస్యలున్న ప్రాంతాల్లో సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. వివిధ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితుల్ని బట్టి బాక్స్‌డ్రెయిన్లు తదితర ప్రత్యామ్నాయాలతో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. వివిధ అవసరాల కోసం జరిపిన రోడ్‌కటింగ్ పనులు పూర్తికాకపోవడం వల్ల కూడా వర్షం వచ్చినప్పుడు సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి.
బాటిల్‌నెక్స్..
నాలాల బాటిల్‌నెక్స్‌లో వానముంపు సమస్యల పరిష్కారానికి రూ.98 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. కానీ వాటిల్లో రూ.4.5 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు పూర్తి కావాల్సిన ప్రాంతాల్లో కాప్రా–నాగారం చెరువు, పటేల్‌కుంట–పెద్దచెరువు, కాటేదాన్ పారిశ్రామికవాడ నుంచి శివరాంపల్లి మీదుగా మీరాలం ట్యాంక్, నిజాం కాలనీ– టోలిచౌకి, బర్లకుంట– ఖాజాగూడచెరువు, హఫీజ్‌పేట చెరువు– పటేల్‌చెరువు, మదీనగూడ–గంగారం చెరువు పరికి చెరువు– «ఆల్విన్‌కాలనీ, వాజ్‌పేయినగర్– ఆర్‌కేపురం చెరువు తదితర ప్రాంతాలున్నాయి.
మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో..
మేజర్ నీటి నిల్వ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన బాక్స్‌డ్రెయిన్ల పనులు పూర్తికాని ప్రాంతాల్లో బయోడైవర్సిటీ జంక్షన్, నాగోల్ – మూసీ తదితరమైనవి ఉన్నాయి. మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 27 కోట్ల పనులు చేపట్టగా పూర్తయినవి రూ. 2కోట్ల పనులే. అలాగే ఇతర పనుల్లో ముర్కినాలా, కళాసిగూడ నాలాలకు సంబంధించిన పనులు పూర్తికావాల్సి ఉంది. వీటితోసహ ఇతరత్రా పనులు వెరసి మొత్తం రూ. 39 కోట్ల పనులకుగాను రూ. 33 కోట్ల మేర పూర్తయ్యాయి. మిగతావి పూర్తికావాల్సి ఉంది. ఆ పనులన్నీ పూర్తయితేనే ఎక్కడికక్కడ వాననీరు వరదకాల్వల గుండా ప్రవహించి రోడ్లపైకి చేరదు. అవి పూర్తికాకపోవడంతో నీరు పారే దారిలేక ప్రధాన రహదారులన్నీ నీటమునుగుతున్నాయి.
పూడికతో..
వీటితోపాటు నాలాల్లో పూడికతీత పనులు పూర్తికాకపోవడం వల్ల కూడా వరదనీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. 800 కి.మీ.ల మేర పూడికతీత పూర్తికావాల్సి ఉండగా, 500 కి.మీ.ల మేర మాత్రమే పూడికతీత జరిగింది. దీంతో కొద్దిచినుకులకే నాలాలు పొంగిపొర్లుతున్నాయి.
డీఆర్‌ఎఫ్ టీమ్స్
ఇవి కాక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్‌ఎఫ్)టీమ్స్ కూడా తక్షణమే రంగంలోకి దిగి తమ సేవలందిస్తాయి. 13 డీఆర్‌ఎఫ్ టీమ్స్‌లో మొత్తం 240 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. షిఫ్ట్‌కు 80 మంది వంతున మూడు షిప్టుల్లో 24 గంటలపాటు విధుల్లో ఉంటారు.
మాన్సూన్‌యాక్షన్ టీమ్స్ రెడీ..– అంచనా వ్యయం రూ. 23 కోట్లు
ఈ సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో వానొస్తే రోడ్లన్నీ నీట మునుగుతుండటంతో తక్షణ చర్యల కోసం వెనువెంటనే సమస్యల పరిష్కారం కోసం ఈ సంవత్సరానికి గాను 291 ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్‌ను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేసింది. వీటిల్లో 76 మినీ మొబైల్ మాన్సూన్ టీమ్స్, 75 మొబైల్ మాన్సూన్ టీమ్స్, 2 జోనల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. ఇవికాక స్థానికంగా ఉండేలా 138 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఉన్నాయి. మినీ మొబైల్ టీమ్స్‌లో జీపుతోపాటు కార్మికులు, మొబైల్ టీమ్‌లో డీసీఎం లేదా జేసీబీలతోపాటు కార్మికులు ఉంటారు. వీటన్నింటి అంచనా వ్యయం రూ.23 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment