వస్త్రాలంకరణ ఇంతింతై! | Dressed intintai! | Sakshi
Sakshi News home page

వస్త్రాలంకరణ ఇంతింతై!

Published Sun, Jan 25 2015 6:23 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

Dressed intintai!

  • విస్తరిస్తున్న బొటిక్ ఫ్యాషన్
  •  కోల్‌కతా డిజైనర్లకు బహు గిరాకీ
  •  రాజధానికి దీటుగా కుట్లు, అల్లికలు
  •  రోజురోజుకూ పెరుగుతున్న మగువల మక్కువ
  • ఖమ్మం : అందంగా కనిపించాలని కోరుకోని మహిళలు ఉండటం అరుదు. అందుకే.. ఆడవారి అలంకరణకు ఆది నుంచే ప్రాముఖ్యత ఉంది. కట్టు, బొట్టు, నిండైన వస్త్రధారణ మన సంస్కృతికి ప్రతీక. ఈ తరహా దుస్తుల తయారీలో భారతీయులు అందెవేసిన చేయి. వస్త్రాలపై అల్లికలు, అద్దాలు, పూలు, డిజైన్లు కుట్టుకోవడం అనాదిగా వస్తోంది. ఒకమాటలో చెప్పాలంటే ఇది మన సంప్రదాయంలో భాగమైంది. పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టిన రోజు తదితర శుభకార్యాలకు వెళ్లినప్పుడు మహిళలు ఈ తరహా వస్త్రాలు ధరిస్తుంటారు. నలుగురు ఒకచోట చేరినప్పుడు ప్రధానంగా అల్లికల ముచ్చట్లే. బొటిక్ ఫ్యాషన్ గురించే చర్చలు. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా, సూరత్, హైదరాబాద్ నగరాలకే పరిమితమైన బొటిక్ సంస్కృతి ఇప్పుడు జిల్లాకు కూడా విస్తరించింది. ఖమ్మంతోపాటు కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో కూడా బొటిక్‌లు వెలిశాయి.
     
    బంజారాల సంప్రదాయ దుస్తుల నుంచి..


    తెలంగాణ ప్రాంతంలో బంజారాలు ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. భాష, సంస్కృతీ సంప్రదాయాలు, వేషధారణ అంతా వెరైటీనే. వారు ధరించే దుస్తులు రాజస్తానీ రాణులను మించిన విధంగా ఉంటాయి. వీరి దుస్తులు రంగురంగు దారాలు, అల్లికలు, వాటి మధ్య అద్దాలు కుట్టి ఆకర్షణీయంగా ఉంటాయి. యుక్త వయస్సు అమ్మాయి మొదలుకొని వృద్ధుల వరకూ వీటిని ధరిస్తుంటారు. వివాహ శుభకార్యం సమయంలో ఈ దుస్తులకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి కూతురు ధరించే జాకెట్‌ను తండాల్లో మహిళలు సుమారు పది రోజులపాటు సమష్టిగా కష్టపడి తయారు చేస్తారు. ఇలాంటి కుట్లు, అల్లికలు కాలగర్భంలో కలుస్తాయేమో అనుకునే సమయంలో ఆ సంస్కృతి మళ్లీ తెరమీదకు వచ్చింది. కొంత మార్పుతో బొటిక్ ఫ్యాషన్‌గా మన ముందుకు వచ్చింది.
     
    రకరకాల డిజైన్లు, అల్లికలు


    బ్లౌజ్‌లు, చీరలు, పంజాబీ డ్రస్సులు, పటియాలు, మిడ్డీలు.. ఇలా ఏ దుస్తులైనా నేడు డిజైన్‌తో కూడుకుని ఉంటున్నాయి. ప్రధానంగా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, డిజైనింగ్ బ్లౌజ్‌లు, స్టోన్ వర్క్స్, కలీ, నార, పూసలు, జర్గోస్, గోల్డ్ వర్క్, డైమండ్, థ్రెడ్‌వర్క్, బీట్, నెక్లెస్, జ్యూవలరీ వర్క్స్ ఇలా రకరకాల వర్క్స్‌తో కుట్టే వస్త్రాలను మహిళలు ఇష్ట పడుతున్నారు. వీటికి కుట్టేందుకు థ్రెడ్ వర్క్, వెల్‌వెట్, నెట్, రాసిల్క్, జూట్ వంటి వస్తువులను ఉపయోగిస్తుంటారు. వీటిని విక్రయించేందుకు ప్రత్యేక షాపులు కూడా ఉన్నాయి.

    మరీ మంచి డిజైన్ వస్తువులు కావాలంటే హైదరాబాద్, బెనారస్, ముంబై, కలకత్తా తదితర మహానగరాల నుంచి జరీ పట్టీలు, ఇతర అలంకరణ వస్తువులు దిగుమతి చేసుకుంటారు. వీటిని కుట్టేందుకు ఒక్క బ్లౌజ్‌కు రూ. 500 నుంచి రూ. 8 వేల వరకు తీసుకుంటారు. ఇదే హైదరాబాద్ వంటి నగరాల్లో సినిమా యాక్టర్లు, మోడల్స్, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతస్థాయి మహిళలు కుట్టించే దుస్తులు రూ. 10 వేలకు మించి ఉంటాయి. చీరలపై డిజైన్ కుట్టించాలంటే రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకూ ఉంటుంది. వీటిని కుట్టేందుకు కోల్‌కత్తా నుంచి వర్కర్లను తీసుకొస్తారు.
     
    రోజుకో కొత్త డిజైన్
    మార్కెట్‌లో రోజుకో కొత్త డిజైన్ వస్తోంది. దానికి అనుగుణంగా రేటు నిర్ధారిస్తుంటాం. డిజైన్లను వెబ్‌సైట్ల నుంచి వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని కష్టమర్లకు చూపిస్తుంటాం. శుభకార్యాలు, పండగలకు గిరాకీ బాగా ఉంటుంది.                  
    - హరిత, బొటిక్ నిర్వాహకురాలు
     
    డిజైన్ డ్రెస్ వేసుకోవాల్సిందే..
    సాదాసీదాగా డ్రస్సులు వేసే వాళ్లం. మారుతున్న కాలంతోపాటు డిజైన్ డ్రస్సులు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఖరీదు ఎక్కువ అయినా యువతులు, విద్యార్థులు డిజైన్ డ్రస్సులు కుట్టించుకుంటున్నారు. కొత్త మోడల్స్ వస్తే ఆ మోడల్ డ్రస్ కుట్టించుకోవాల్సిందే. దీని అనుగుణంగా ఖమ్మంలో బొటిక్‌లు పెట్టడం సంతోషం.                           
    - ప్రియాంక, యువతి
     
    నలుగురు కూడితే డిజైన్ల ముచ్చట్లే..
    గతంలో బతుకమ్మ పండుగ, వివాహా శుభకార్యాల వద్ద బంగారు ఆభరణాల గురించి చర్చ జరి గేది. ఇప్పుడు నలుగురు మహిళలు ఒక చోటికి చేరితే డిజైనింగ్, బోటిక్‌ల ముచ్చట్లే. వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చీరలకు అనుగుణంగా జాకెట్లు కుట్టించుకోవాలి. బంగారు నగలతోపాటు డిజైన్లతో కూడిన బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఇందుకు ఎంత ఖర్చయినా వెనకాడేది లేదు.
     - కడారు ప్రమద, గృహిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement