
ఎండిన పంట.. ఆగిన గుండె
రంగారెడ్డి జిల్లాలో గుండెపోటుతో రైతు మృతి
బంట్వారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తిచేను ఎండుముఖం పట్టడం.. అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతన్న గుండె ఆగింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జినుగుర్తి మల్లయ్య(50) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఖరీఫ్ సీజన్‌లో పత్తిపంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం రెండేళ్లుగా వడ్డీ వ్యాపారుల వద్ద రూ.20 వేలకు పైగా అప్పు చేశాడు. అసలు, వడ్డీ కలిపి ఇటీవల రూ.లక్ష దాటిపోయింది. వర్షాభావ పరిస్థితులతో పత్తిపంట ఎండుముఖం పట్టింది.
బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన మల్లయ్య చేనును చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రాత్రి ఇంటికి వెళ్లిన ఆయన అప్పులు ఎలా తీర్చుదామంటూ కుటుంబసభ్యులతో ఆవేదన వ్య క్తం చేశాడు. ఈక్రమం లో గురువారం తెల్లావారుజామున మల్లయ్యకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంట నే వికారాబాద్ ఆస్పత్రికి తరలించేయత్నం చేయగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతుడికి భార్య చంద్రమ్మ, ఇద్దరు కొడుకులున్నారు.