
‘అత్తారింటికి’ కొత్తదారి!
- నేపాల్ మార్గం పట్టిన ‘ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లు’
- ఎల్‌ఓసీలు ఉన్నా చిక్కకుండా ఈ ఎత్తుగడ
- చెక్ చెప్పేందుకు సీసీఎస్ పోలీసుల యత్నాలు
సాక్షి, హైదరాబాద్: ‘సార్...విదేశాల్లో ఉన్న నా భర్తపై ఎల్‌ఓసీ జారీ చేశామని మీరు చెప్పారు. ఆయన ఇటీవలే మా అత్తమామల వద్దకు వచ్చి వెళ్లాడు. అయినా మీరు పట్టుకోలేకపోయారు’. - వరకట్న వేధింపుల కేసుల్లో బాధితులు అనేక మంది పోలీసుల వద్ద వాపోతున్న అంశమిది. ఇది ఎలా ధ్యమని శోధించిన పోలీసులు సదరు నిందితులు ‘అ త్తారింటికి’ వచ్చి వెళ్లేందుకు కొత్తదారి కనిపెట్టారని గుర్తించారు. దీనికి చెక్ చెప్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.
అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడతున్న, అనేక రకాలుగా మోసం చేసిన ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లకు సంబంధించిన కేసులు పోలీసుల వద్దకు నిత్యం వస్తున్నాయి. పెళ్లి చేసుకుని తీసుకెళ్లడంలేదని, అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని, లేని అర్హతలు చెప్పి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంటారు. వీటిపై కేసులు నమోదు చేసుకుం టున్న పోలీసులు నిందితులుగా ఉన్న ‘అల్లుళ్ల’ను అరెస్టు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
‘రంగు’ మారిన నోటీసులు...
ఒకప్పుడు 498(ఎ) తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలను అరెస్టు చేసేందుకు సీఐడీ ద్వారా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించేవారు. ఆ సంస్థ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి, ఆయా దేశాల్లో ఉన్న పోలీసులు పట్టుకునేలా చేసి ఇక్కడకు తీసుకొచ్చేవారు. అయితే భారత్‌లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనే ది తీవ్రమైన నేరం కాదు. దీంతో రెండేళ్ల క్రితం నుంచి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ ఆపేసింది. వీటి స్థానంలో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తూ... కేవలం నిందితుల ఆచూకీ తెలిపేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా వారి ఆచూకీ తెలిసినా... ఇక్కడి పోలీసులు వెళ్లి తీసుకురావడం అసాధ్యమవుతోంది. ఇది వాంటెడ్‌గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది.
ఇటీవల ఎల్‌ఓసీనే అనుసరిస్తున్నారు...
ఇంటర్‌పోల్ ద్వారా రెడ్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయించడం అంత సులువు కాదు. స్థానిక పోలీసులు నేరుగా ఇంటర్‌పోలును ఆశ్రయించలేరు. నోడల్ ఏజెన్సీగా పని చేసే సీఐడీ వంటి వ్యవస్థల ద్వారా వెళ్లాలి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్‌గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లపై లుక్ ఔట్ సర్క్యు లర్ (ఎల్‌ఓసీ) జారీ చేస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ పంపిస్తారు. ఫలితంగా సదరు వ్యక్తి విదేశం నుంచి వచ్చిన వెంటనే అక్కడే చిక్కే అవకాశం ఉంటుంది.
‘రూటు’ మార్చిన కేటుగాళ్లు...
ఇటీవల కాలంలో దీన్నీ తప్పించుకునేందుకు సదరు నిందితులు ఏకంగా కొత్త రూటునే కనుగొన్నారు. విదేశాల నుంచి నేరుగా ఇక్కడకు వచ్చి ఏ విమానాశ్రయంలో దిగినా... ఇమ్మిగ్రేషన్‌లో చిక్కుతామనే ఉద్దేశంతో వయా నేపాల్ ప్రయాణాలు ప్రారంభించారు. ఆయా దేశాల నుంచి పొరుగున ఉన్న నేపాల్‌కు వచ్చి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఆపై సమీపంలోని విమానాశ్రయం ద్వారా డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో చేరాల్సిన చోటుకు వెళ్లిపోతున్నారు. డొమెస్టిక్ ప్రయాణాలకు పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ వంటివి ఉండకపోవడంతో వీరిని ఎవరూ వాంటెడ్‌గా గుర్తించి, పట్టుకోలేకపోతున్నారు. తిరుగు ప్రయాణాలకూ ఇదే మార్గాన్ని అనుసరిస్తున్న నిందితులు ఎవరికీ చిక్కకుండా ‘అత్తారింటికి’ రాకపోకలు సాగించేస్తున్నారు. దీనికి చెక్ చెప్పేందుకు పోలీసులు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఆయా దేశాలకే సమాచారమిచ్చే సరికొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నారు.
ఇలా దొరుకుతారు...
ఎల్‌ఓసీలు జారీతో కొందరు వాంటెడ్ అల్లుళ్లు పోలీసులకు చిక్కారు. ఎల్‌ఓసీ జారీ అయిన వ్యక్తి వ్యక్తిగత, కేసు వివరాలతో పాటు పాస్‌పోర్ట్ నెంబర్లను విమానాశ్రయాల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసుకుంటారు. అతడు విమానం దిగిన వెంటనే జరిగే ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో వాంటెడ్ అని వెలుగులోకి రావడంతోనే అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసులు వచ్చి నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్‌పోర్ట్ దాటకుండా తమ ఆధీనంలోనే ఉంచుకుంటారు. అంతర్జాతీయ ప్రయాణాలకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలనేది కచ్చితమైన అంశం.
ఎంబీసీలకు సమాచారం...
‘‘సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో నమోదైన కేసుల్లో 31 మంది ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లు వాంటెడ్‌గా ఉన్నారు. వీరిని పట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఈ కారణంగానే వీరి వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో పాటు వారు పని చేస్తున్న సంస్థలకూ తెలియజేయాలని నిర్ణయించాం. ఈ విధానంతో నిందితుల్ని అరెస్టు చేయడం సాధ్యం కాకున్నా వారు వాంటెడ్ అనే విషయం తెలిసి భవిష్యత్తులో నిందితులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి’’
- జి.పాలరాజు, క్రైమ్స్ డీసీపీ