డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌ | Drugs sale in hyderabad via Dark Web | Sakshi
Sakshi News home page

డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌

Published Fri, Jul 7 2017 12:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌ - Sakshi

డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌

ఆర్డర్‌ చేస్తే పోస్ట్‌లో గుమ్మం ముందుకు..
- బ్లాటింగ్‌ పేపర్‌ రూపంలో వచ్చి చేరుతున్న వైనం
- సొమ్మును ‘బిట్‌ కాయిన్‌’గా మార్చి అంతర్జాతీయ
- మార్కెట్‌లో డ్రగ్స్‌ కొనుగోలు
- నగరంలో ముఠా గుట్టు రట్టు
- ఇద్దరి అరెస్ట్‌..
- 62 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ స్వాధీనం


సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలో చాపకింద నీరులా విస్తరించిన మత్తు దందా కొత్త పంథాలో నడుస్తోంది! డార్క్‌నెట్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు.. డ్రగ్స్‌ వచ్చి డోర్‌ తడుతున్నాయి. బయటకెళ్లే అవసరం కూడా లేకుండా పోస్ట్‌లో ఇంటికే వచ్చేస్తున్నాయి. హైదరాబాద్‌లో తాజాగా ఈ తరహా ఉదంతం బయటపడటం కలకలం రేపుతోంది. నార్కోటిక్‌ డ్రగ్‌ నియంత్రణ అధికారులకే దిమ్మ తిరిగే తరహాలో సాగుతున్న ఈ దందా వేళ్లూనుకుంటే ఆపటం ఎవరి తరం కాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మొదట్లో కొన్నాడు.. తర్వాత అమ్మాడు..
గురువారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు మరో డ్రగ్స్‌ గ్యాంగ్‌ గుట్టును రట్టు చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మూడోకంటికి తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా సాగుతున్న ఈ దందాను ఎక్సైజ్‌ యాంటీ నార్కోటిక్‌ టీం లీడర్‌ అంజిరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం బయటపెట్టింది. వివరాలివీ.. ఓల్డ్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన సంతోష్‌ దీపక్‌ (22), ఏఎస్‌రావునగర్‌కు చెందిన కేపీ అనిరుధ్‌ (30) లు డార్క్‌నెట్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించి విక్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి 62 ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ బ్లాటింగ్‌ పేపర్‌ వృత్తాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి 200 ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ తెప్పించిన సంతోష్‌ దీపక్‌... ఇందులోంచి 138 బ్లాటింగ్‌ పేపర్‌ వృత్తాలను ఇప్పటికే విక్రయించినట్టు నిర్ధారించారు. వీటిని రాంకోఠిలోని రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులకు రూ.4 వేల చొప్పున అమ్మినట్టు నిందితులు చెప్పినట్టు హైదరాబాద్‌ ఎక్సైజ్‌ డీసీ వివేకానందరెడ్డి వెల్లడించారు. సంతోష్‌ దీపక్‌ ఇంతకుముందు మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఓ కాలేజీలో చదివేవాడు. అయితే ఆయనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని గమనించిన యాజమాన్యం కాలేజీ నుంచి పంపేసింది. అక్కడ్నుంచి అతడు బెంగళూరు వెళ్లి ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాడు. అక్కడా అతడిని కాలేజీ నుంచి పంపేశారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన సంతోష్‌ పూర్తిగా డ్రగ్స్‌కు బానిసగా మారాడు. మొదట్లో ఇతర డ్రగ్స్‌ ముఠాల వద్ద అడిగినంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేసేవాడు. క్రమంగా తానే డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.

యాప్‌.. డిజిటల్‌ మనీ..
ఇంటర్నెట్‌పై మంచి పట్టున్న సంతోష్‌ డార్క్‌నెట్‌ ద్వారా అంతర్జాతీయ డ్రగ్‌ మార్కెట్‌ను పట్టుకున్నాడు. జబ్‌పే (జెడ్‌ఈబీ) పే యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోన్‌ చేసుకొని దానికి తన బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశాడు. డ్రగ్‌ అవసరమైనప్పుడల్లా తన ఖాతాలోని డబ్బును జబ్‌పే యాప్‌కు బదిలీ చేసేవాడు. ఈ డబ్బును జబ్‌పే యాప్‌ ‘బిట్‌ కాయిన్‌’గా మార్చి తిరిగి ఆయనకు ఇచ్చేంది. బిట్‌ కాయిన్‌ అంటే ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీలోకైనా మార్చుకోగలిగే డిజిటల్‌ మనీ అన్నమాట!

ఈ డిజిటల్‌ మనీతో సంతోష్‌ అంతర్జాతీయ డ్రగ్‌ మార్కెట్‌లో 200 ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌కు అర్డర్‌ ఇచ్చారు. ఇవి ఒక కవర్‌లో రూపంలో (బ్లాటింగ్‌ పేపర్‌పై చిన్నచిన్న వృత్తాలుగా) పోస్ట్‌ ద్వారా సంతోష్‌ ఇంటికి చేరాయి. ఆ డ్రగ్స్‌ను విక్రయించేందుకు ఇతడు ఓ కొరియర్‌ ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కేపీ అనిరుద్‌ ద్వారా పలువురుకి అమ్మాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ యాంటీ నార్కోటిక్‌ డ్రగ్‌ టీం గురువారం ఉదయం వలపన్ని వీరిని పట్టుకుంది. నిందితుల సెల్‌ఫోన్లలోని కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. అందులోని నంబర్ల వివరాలు బయటికి వస్తే ఎవరెవరు డ్రగ్స్‌ కొంటున్నారో బయటపడే అవకాశం ఉంది. ఎక్సైజ్‌ యాంటీ నార్కోటిక్‌ డ్రగ్‌ టీం ఏర్పడిన తొలిరోజే వీరు పట్టుబడటం గమనార్హం.

డార్క్‌ వెబ్‌ అంటే..
ఇది ఇంటర్‌నెట్‌లోనే ఇదో ఓ మాయా జగత్తు. సాధారణ సెర్చ్‌ ఇంజన్లు, సాఫ్ట్‌వేర్స్‌లతో దీన్ని చూడలేం. డార్క్‌ నెట్‌వర్క్‌లో సభ్యులుగా ఉన్నవాళ్లు మాత్రమే ఇందులోకి ప్రవేశించగలరు. సెర్చింగ్‌ కోసం ప్రత్యేకమైన ట్రైజర్లు తప్పనిసరి. ఇందులో సభ్యుడిగా ఉన్నవారు ఒకే ఐడీ, పాస్‌ వర్డ్‌తో అన్ని లింక్డ్‌ సైట్లలోకి ఏకకాలంలో ప్రవేశించవచ్చు. డార్క్‌నెట్‌వర్క్‌లో సభ్యుడిగా చేరగానే చీకటి సామ్రాజ్యంలోని అన్ని నెట్‌వర్క్‌ వెబ్‌సైట్లలో సభ్యుడిగా చేరిపోతారు. నిఘా వర్గాలకు అంత సులువుగా చిక్కని ఈ డార్క్‌నెట్‌నే డ్రగ్స్‌ మాఫియా వినియోగించుకొంటోంది. దీనిద్వారా డ్రగ్స్‌తోపాటు ఇతర నిషేధిత వస్తువుల క్రయవిక్రయాలు సాగుతున్నాయని చెబుతున్నారు.

బ్లాటింగ్‌ పేపర్‌పై వృత్తాలుగా..
గతంలో ఎల్‌ఎస్‌డీ (లిసర్జిక్‌ యాసిడ్‌ డై ఇథైలమైడ్‌) లిక్విడ్‌ను సిరంజీల ద్వారా నరాల్లోకి ఎక్కించుకునేవాళ్లు. అయితే దీంతో నొప్పితో కూడుకొని ఉండటంతో రూటు మార్చారు. ఇందులో భాగంగా ఎల్‌ఎస్‌డీ లిక్విడ్‌ చుక్కను బ్లాటింగ్‌ పేపర్‌పై వేస్తారు. ఈ పేపర్‌ లిక్విడ్‌ను పీల్చుకొని తనలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. ఎంత కాలమైనా ఆ పేపర్‌లోనే ఉండిపోతుంది. కాగితంపై డ్రగ్‌ ఆవరించినంత మేరకు వృత్తాకారంలో గీతలు ప్రింట్‌ చేస్తారు. డ్రగ్‌ పరిమాణాన్ని బట్టి ఈ వృత్తాల సైజ్‌ ఉంటుంది. 125 మైక్రోగ్రామ్‌ నుంచి 250 మైక్రో గ్రాముల వరకు డ్రగ్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కాగితంపై ఉన్న వృత్తాన్ని (ఒక్కో వృత్తం ఖరీదు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా ఉంది) నాలుగు భాగాలుగా కత్తిరించి అందులోంచి ఒక భాగాన్ని నాలుకపై పెట్టుకొని చప్పరిస్తారు. ఇది ఒకసారి చప్పరిస్తే 8 గంటల వరకు మత్తులో ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement