
సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోందని, దేశనిర్మాణంలో తెలంగాణ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ‘గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర నిర్మాణనానికి మంచి అడుగులు పడ్డాయి. వినూత్న ఆలోచనలతో సీఎంగా కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా.. రాష్ట్ర పునర్నిర్మాణ చర్యలు చేపట్టారు. బలమైన నాయకత్వం వల్ల అందుకు సానుకూలత చేకూరింది’ అని గవర్నర్ పేర్కొన్నారు.
నిబద్ధతతో కూడిన పరిపాలన కారణంగానే..
సంక్షేమ , అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రజల మనుసులు గెలుచుకున్నాయని, అందుకే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి పట్టంకట్టారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతిఏటా రూ. 40 వేలకోట్లతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒక్కటైన సాగునీటి సాధనకోసం.. కోటి 25 లక్షల ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ రబీ నుంచే కాళేళ్వరం ప్రాజెక్టు ఫలాలు తెలంగాణ ప్రజలకు అందేలా వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి, ప్రాజెక్టులు ఆన్ సకాలంలో పూర్తి చేస్తామన్నారు.
మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో భగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ప్రతి వ్యక్తికి రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు, ఆవాసాలకు మంచినీరు అందుతున్నాయని తెలిపారు. రైతుబంధు పథకం జాతీయ ఎజెండాగా మారిందని ప్రశంసించారు. కేసీఆర్ కిట్‌తో మాతాశిశు మరణాలు తగ్గాయని చెప్పారు. నిబద్ధతతో కూడిన పరిపాలన కారణంగానే కేసీఆర్ మరోసారి గెలుపొందారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment