ఈ చలాన్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఆధార్ కార్డులోని చిరునామాను ప్రామాణికంగా తీసుకుంటూ 3 కిమీ నిబంధన అమలు చేయాలని భావించారు.
అయితే అనేక మంది ఆధార్ కార్డుల్లోని చిరునామాలు అప్‌డేట్ కాకపోవడంతో ఇది సాధ్యం కాలేదు. ఇలా నిర్దేశించిన పరిధిని దాటి తమ వాహనాల్లో సంచరించే వారికి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) సిస్టమ్ ద్వారా చెక్ చెప్తున్నారు. ఈ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) ద్వారా ట్రాఫిక్ కెమెరాలకు ఏర్పాటై ఉంది. సిటీలోని 250 జంక్షన్లలోని ట్రాఫిక్ కెమెరాల్లో ఇది అందుబాటులో ఉంది. ఏఎన్‌పీఆర్ సిస్టమ్ పూర్తి సాఫ్ట్‌వేర్ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం. దీన్ని బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు వినియోగించడానికి దీని ప్రోగ్రామింగ్‌లో స్వల్ప మార్పులు చేశారు.
ఇలా పని చేస్తుంది, పట్టుకుంటుంది...
♦ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పగటి వేళల్లో బయటకు వచ్చిన వాళ్లు తాము నివసించే ప్రాంతం నుంచి గరిష్టంగా 3 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సంచరించాలి.
♦ దీని ప్రకారం చూస్తే ఆ వ్యక్తి రెండు ట్రాఫిక్ జంక్షన్లను దాటి వెళ్ళే అవసరం ఉండదు.
♦ ఓ వాహనం మొదటి జంక్షన్ మీదుగా ప్రయాణించినప్పుడు అక్కడ ఉండే ట్రాఫిక్ సీసీ కెమెరా ఏఎన్‌పీఆర్ టెక్నాలజీ ద్వారా దాని నెంబర్‌కు రీడ్ చేస్తుంది.
♦ అప్పటి నుంచి ఆ వాహనం ఆ రోజు మొత్తం ఎన్ని జంక్షన్లు దాటింది అనే అంశాన్నీ ఈ టెక్నాలజీతో కూడిన కెమెరాలు పరిశీలిస్తూనే ఉంటాయి.
♦ ఇలా నిర్దేశిత మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఆ వాహనం సంచరించిన వెంటనే తక్షణం ఆ విషయాన్ని గుర్తిస్తూ సర్వర్ ఈ–చలాన్ జనరేట్ చేస్తుంది.
♦ ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న వాహన యజమాని చిరునామా ఆధారంగా ఈ ఈ–చలాన్ బట్వాడా అవుతుంది. వాహన యజమానికి ఎస్సెమ్మెస్ రూపంలోనూ సందేశం వస్తుంది.
♦ ఇలాంటి వైలేషన్స్‌కు పాల్పడిన వాహన చోదకులకు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 కింద జరిమానా విధిస్తున్నారు.
♦ దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది.
రెండోసారి కనిపిస్తే వాహనం సీజ్
ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఆకతాయి చేసే ఉల్లంఘన కారణంగా నిజంగా అవసరం ఉన్న వ్యక్తి ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. అలా అని ప్రతి వాహనచోదకుడినీ పోలీసులు ఆపి వారి ఆధార్‌లోని చిరునామా అప్‌డేట్ అయిందా? లేదా అనేది గుర్తించడం కష్టసాధ్యం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిపై ఏఎన్‌పీఆర్ టెక్నాలజీ ద్వారా నిఘా ఉంచుతున్నాం. బుధవారం నుంచి మొదలైన ఈ విధానం ద్వారా రెండు రోజుల్లో 56 మందిని గుర్తించి చలాన్లు జారీ చేశాం. ఇప్పటి వరకు రెండోసారి ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళు లేరు. అలా ఎవరైనా కనిపిస్తే ఈ–చలాన్ జారీ చేయడంతో పాటు తక్షణం ఆ విషయాన్ని ఆ వాహనం సంచరిస్తున్న ప్రాంతంలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇస్తాం. వాళ్ళు వాహనం పట్టుకుని సీజ్ చేస్తారు. లాక్‌డౌన్ కాలం ముగిసిన తర్వాతే, ఈ–చలాన్లు చెల్లింపు క్లియర్ అయ్యాకే దాన్ని తిరిగి ఇస్తాం. – నగర ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment