- జూన్ 9 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఈ-పంచాయత్ వ్యవస్థల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ-పంచాయిత్ వ్యవస్థలను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఈ-పంచాయత్‌లను మార్చిలోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా (ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు తదితర) అవాంతరాలు వచ్చిపడటంతో ఆ కార్యక్రమం అమల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది.
మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ పనులు పూర్తికాకపోవడం కూడా మరో కారణంగా అధికారులు చె బుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ పనులు పూర్తయినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ-పంచాయత్‌ల వ్యవస్థల ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ- పంచాయత్ వ్యవస్థను అమలు చేసి వచ్చిన ఫలితాలను బట్టి దశల వారీగా మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. పని సౌలభ్యం మేరకు రాష్ట్రంలోని 8,892 గ్రామాలను 5,232 క్లస్టర్ గ్రామాలుగా అధికారులు విభజించారు. చిన్నచిన్న గ్రామ పంచాయతీలను సమీపంలోని పెద్ద గ్రామ పంచాయితీ (క్లస్టర్)లకు అనుసంధానం చేశారు. తొలిదశలో 2,440 గ్రామ పంచాయతీల్లో, రెండోదశలో 2,792 గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయత్ వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.