
రాజకీయ ప్రక్రియ మొదలు పెట్టండి
మేడిగడ్డ, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై రాష్ట్రానికి మహారాష్ట్ర సూచన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, తమ్మిడిహెట్టి బ్యారేజీల నిర్మాణాలకు మహారాష్ట్ర లైన్ క్లియర్ చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా వీటిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బ్యారేజీ నిర్మాణాలపై అధికారుల స్థాయిలో జరగాల్సిన ప్రక్రి య పూర్తయింది. బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తమకున్న అన్ని రకాల అనుమానాలు నివృత్తి అయిన దృష్ట్యా తమవైపు నుంచి పూర్తి అంగీకారాన్ని తెలుపుతున్నామని, ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ మాత్రమేనని మహారాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బ్యారేజీలపై అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రక్రియను వేగిరం చేసుకోవాలని మహారాష్ట్ర అధికారులు తాజా గా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
అన్ని అనుమతులకూ ఓకే..
మేడిగడ్డ వద్ద నీటి లభ్యత విషయమై కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వం హైడ్రాలజీ సర్వేలు చేస్తోంది. అన్ని అంశాలను క్రోడీకరించుకున్నాక దీనికి మూడు రోజుల కిందటే క్లియరెన్స్ ఇచ్చింది. ఇక తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో తమ ప్రాంతంలో ఎలాంటి ముంపు లేనందున దానికి సమ్మ తం తెలిపింది. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సం బంధించిన డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై మహారాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) అధికారులతో 20రోజులుగా నాసిక్ కేంద్రంగా జరిగిన చర్చలు సైతం ఫలప్రదమయ్యాయి.
రెండు నెలల కిందట జరిగిన సమావేశంలో మహారాష్ట్ర 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డను అంగీకరిస్తూనే, జాయిం ట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు అంగీకరిస్తామని తెలిపింది. దానికి అనుగుణంగా సర్వే చేసిన అధికారులు 102 మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున వీటిని పరిశీలించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో నిర్ణయం చేయాల్సి ఉందని మహారాష్ట్ర అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పెనుగంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరాటకు సంబంధించిన అటవీ, మైనింగ్, పర్యావరణ అనుమతులకు సైతం మహారాష్ట్ర ఇదివరకే క్లియరె న్స్‌లు ఇచ్చింది.
సీఎంతో హరీశ్ చర్చలు
ఒప్పందాలపై రాజకీయ ప్రక్రియ మొదలు పెట్టాలన్న మహారాష్ట్ర సూచన మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఈ అంశమై సీఎం కేసీఆర్‌తో చర్చించారు. రూ.5,813 కోట్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల టెండర్లు ఖరారు కావడం, వీటి మధ్య పంప్‌హౌస్‌ల నిర్మాణం, హైడ్రో మెకానికల్ పనులకు రూ.7,998 కోట్లతో టెండర్ల ప్రక్రియ సోమవారం ముగియనున్న దృష్ట్యా ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, ఒప్పందాల ప్రక్రియ తేదీలను నిర్ణయించాలని కోరారు. మహా రాష్ట్ర సీఎం ఇచ్చే సమయం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరుగనుంది.