‘లైన్’ క్లియర్
- అనంత- అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు రూ.29 వేల కోట్లు
- ప్రకటించిన కేంద్రం
– జిల్లాలో 74.750 కి.మీ మేర రహదారి నిర్మాణం
అనంతపురం అర్బన్ : అనంతపురం నుంచి రాజధాని అమరావతికి ‘గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే’ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. అమరావతి వరకు 598.78 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.29 వేల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 23 గ్రామాల మీదుగా 74.750 కిలోమీటర్ల మేర మలుపులు లేని రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 1,354 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. రహదారి నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఇప్పటికే పెగ్ మార్కింగ్ ప్రక్రియను చేపట్టింది. 44 నంబర్ జాతీయ రహదారి (హైదరాబాద్– బెంగళూరు)లోని రాప్తాడు మండలం మరూరు గ్రామ పరిధిలో ఈ రహదారి ప్రారంభమవుతుంది.
రాప్తాడు మండలంలో రెండు గ్రామాలు, అనంతపురం రూరల్ పరిధిలో మూడు, బుక్కరాయసముద్రం మూడు, నార్పల నాలుగు, పుట్లూరు నాలుగు, తాడిపత్రి మండలంలో ఏడు గ్రామాల మీదుగా వెళుతుంది. తాడిపత్రి మండలం ఊరిచింతల గ్రామం మీదుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా అమరావతికి వెళుతుంది. ఈ రహదారిని మూడు ఫీడర్లుగా విభజించారు. అనంతపురం ఫీడర్‌లో 371.03 కిలోమీటర్లు, కర్నూలు 123.7 కి.మీ, కడప ఫీడర్‌లో 104.05 కి.మీ ఉంటుంది. 391.38 కి.మీ నాలుగు లేన్లతో, 207.4 కి.మీ ఆరు లేన్లలో నిర్మిస్తారు. అలాగే 43 మేజర్ బ్రిడ్జిలు, ఆరు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, 28 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించనున్నారు.