- అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు భూములిచ్చేందుకు రైతుల విముఖత
- సాగుకు యోగ్యంకాని వాటిని సేకరించాలని డిమాండ్
- ప్రభుత్వమిచ్చే పరిహారం కూడా గిట్టుబాటు కాదంటున్న అన్నదాతలు
- ఇటీవల కందుకూరులో భూసేకరణ సర్వేను అడ్డుకున్న వైనం
- భూసేకరణకు వ్యతిరేకంగా ఓ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామంటున్న విపక్షాలు
అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ వే.. ఈ హైవేలోనే రైలుమార్గం కూడా ఉంటుంది. తక్కువ సమయంలో రాజధానికి చేరే మార్గమిది. అనంతపురంతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల ప్రజలకూ ఇది ఉపయుక్తమే. అయితే.. ఈ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మాత్రం రైతులను తీవ్రంగా కలచివేస్తోంది.
అసలే కరువు జిల్లా.. వ్యవసాయానికి దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం, వ్యవసాయయోగ్యం కాని భూములను వదిలేసి, పంటలు పండే వాటిని సేకరించడం సరికాదని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణలో రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే భూములు ఇచ్చేందుకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెబుతున్నారు.
రహదారి పొడవు 393.594 కి.మీ
అనంతపురం నుంచి అమరావతికి ప్రస్తుతం 476 కిలోమీటర్ల (కి.మీ) దూరముంది. ఎక్స్‌ప్రెస్ వేను 393.594 కి.మీ దూరంతో నిర్మించనున్నారు. దీంతో దాదాపు 83 కి.మీ దూరం తగ్గుతుంది. అనంతపురం జిల్లాలో 74.750 కి.మీ, కర్నూలు 80.800, ప్రకాశం 145.800, గుంటూరు జిల్లాలో 92.244.. మొత్తం కలిపి 393.594 కి.మీ రోడ్డు నిర్మించనున్నారు. ఇందులో 185.400 కి.మీ ఫోర్‌లేన్ (నాలుగు వరుసల రహదారి), 208.194 కి.మీ సిక్స్‌లేన్ (ఆరు వరుసల రహదారి) ఉంటుంది.
జిల్లాలో రహదారి ఇలా...
ఎక్స్‌ప్రెస్ వే జిల్లాలో 74.750 కి.మీ పొడవు ఉంటుంది. రాప్తాడు, అనంతపురం, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, తాడిపత్రి మండలాల పరిధిలోని 23 గ్రామాల మీదుగా వెళ్లేందుకు డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లో పొందుపరిచారు. రాప్తాడు మండలంలోని బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 44) నుంచి ఎక్స్‌ప్రెస్ వే మొదలవుతుంది. జిల్లాలో ఈ రహదారి నిర్మించేందుకు 1,354 హెక్టార్ల (3,385 ఎకరాల) భూమి అవసరమని నిర్ధారించారు. ఇందులో 48 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇది కాకుండా రాప్తాడు పరిధిలో 79.50 హెక్టార్లు, అనంతపురం మండలంలో 140.25 హెక్టార్లు, నార్పలలో 155.25 హెక్టార్లు, బుక్కరాయసముద్రంలో 192 హెక్టార్లు, పుట్లూరులో 208.5 హెక్టార్లు, తాడిపత్రి పరిధిలో 297.75 హెక్టార్లు సేకరించనున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 61.82 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో వర్షాధారం, సాగునీటి వసతిపై ఆధారపడి 45 లక్షల ఎకరాల్లో అతికష్టం మీద పంటలు వేస్తున్నారు. తక్కిన 16.82లక్షల ఎకరాలు బీడు భూమి. ఈ క్రమంలో జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా పథకాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించారు. హంద్రీ-నీవా ద్వారా 2012 నుంచి కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నాయి. కానీ.. ఉరవకొండ నియోజకవర్గంతో పాటు రాప్తాడు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల తదితర నియోజకవర్గాల్లో విండ్‌పవర్ పేరుతో వేల ఎకరాల వ్యవసాయ భూములను సేకరిస్తున్నారు.
దీంతో పాటు సోలార్‌పవర్ పేరుతో సేకరించిన భూములు కూడా వ్యవసాయానికి పనికొచ్చేవే. స్థానిక టీడీపీ నేతలు రైతులను ప్రలోభపెట్టి, భయపెట్టి ఈ భూములను తక్కువ ధరకు కొని, అధిక ధరతో విండ్‌పవర్ కంపెనీలకు విక్రయిస్తున్నారు. భూములను కోల్పోయిన రైతులు మాత్రం వచ్చిన డబ్బుతో రుణాలు తీర్చి.. ఆపై బతికేమార్గం లేక వీధిన పడుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు కూడా కృష్ణాజలాలు వచ్చాయి. నీళ్లొచ్చాయి.. పంటలు పండించుకోవచ్చని జలాశయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.
అయితే.. రిజర్వాయర్‌కు సమీపంలోని 5 గ్రామాల్లో వ్యవసాయ భూములను పారిశ్రామికవాడ పేరుతో సేకరిస్తున్నారు. ఇందులో 600 ఎకరాలు ఇప్పటికే కియో కార్లపరిశ్రమకు కట్టబెట్టారు. పనులు కూడా జరుగుతున్నాయి. మరో 2,500 ఎకరాలు కూడా సేకరించారు. పరిశ్రమల కోసం వ్యవసాయానికి పనికిరాని బీడు భూములను సేకరించొచ్చు. కానీ ప్రభుత్వం వ్యవసాయభూములనే లాగేసుకుని రైతులకు బతుకు లేకుండా చేస్తోంది.
రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదు..
ఎక్స్‌ప్రెస్ హైవే కోసం అవసరమైన 3,385 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు విముఖత చూపుతున్నారు. ఇటీవల అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరులో సర్వేచేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. ‘గతంలో గోడౌన్లు నిర్మిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి భూములు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏ అభివృద్ధీ జరగలేదు. ఇప్పుడు అన్నంపెట్టే భూములను తీసుకుంటున్నారు. వీటిని ఇచ్చే ప్రసక్తే లేదు. సర్వే చేయకుండా వెళ్లిపోండి’ అంటూ అడ్డుకున్నారు. 393 కి.మీ రహదారి మరో 50 కి.మీ పెరిగినా ప్రయాణికులకు వచ్చే నష్టమేమీ లేదని, వ్యవసాయానికి పనికిరాని భూములు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయో చూసి.. వాటి మీదుగా రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. రెవెన్యూ అధికారులు మాత్రం సర్వే కొనసాగిస్తున్నారు.
పంట భూములు ఇవ్వం
ఎక్స్‌ప్రెస్ వేకు మా భూమి పది ఎకరాలు సేకరించారు. ఈ పదెకరాలూ పంటలు పండే భూమి. ఇందులో ద్రాక్ష సాగు చేశా. దీన్ని కోల్పోయి.. వారిచ్చే అరకొర పరిహారం తీసుకుని ఊరు వదిలిపోవాలా? ఎట్టిపరిస్థితుల్లోనూ సెంటు భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు.
- హనుమంతరెడ్డి, పూలకుంట, అనంతపురం మండలం
ఆ అభివృద్ధి మాకొద్దు
నా భూమి నాలుగెకరాలు పోతోంది. ఎక్స్‌ప్రెస్ వే వస్తే రహదారి పక్కనే ఉన్న గ్రామాలు అభివద్ధి చెందుతాయని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతున్నారు. ఆ అభివృద్ధి మాకొద్దు. ఇప్పటికే ఎఫ్‌సీఐ గోదాములకు భూములను వదులుకున్నాం. వీటికీ వదులుకుని రోడ్డునపడలేం. రైతులంతా ఓ కమిటీగా ఏర్పడైనా సరే భూ సేకరణను అడ్డుకుంటాం.
- శివారెడ్డి, కందుకూరు, అనంతపురం మండలం
రైతులకు అండగా నిలుస్తాం
ఎక్స్‌ప్రెస్ వే కోసం వ్యవసాయభూములను సేకరించడం దారుణం. దీన్ని మొదట్నుంచీ మేం వ్యతిరేకిస్తున్నాం. విండ్, సోలార్‌పవర్, పారిశ్రామికవాడలు...ఇలా దేనికి తీసుకున్నా వ్యవసాయ భూములనే సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి పనికొచ్చే భూములే తక్కువ. వీటినీ తీసుకుంటే ఎలా? సాగుభూములు అయితే చదునుగా ఉంటాయి. రాజకీయనాయకులు కూడా సులభంగా రహదారి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయొచ్చు. రైతులు ఎలాపోయినా తాము అభివృద్ధి చెందొచ్చని నేతలు అనుకుంటున్నారు. అన్నంపెట్టే భూములను కోల్పోయి రైతులు కొండలు, గుట్టల కిందకు వెళ్లాలా? లేదంటే ఊళ్లు వదిలి శాశ్వతంగా వలసెళ్లాలా? ఎక్స్‌ప్రెస్ వే దూరం కాస్త పెరిగినా బీడుభూములనే సేకరించాలి. ఈ విషయంలో రైతులకు అండగా ఉంటాం.
- రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి