- నిబద్ధత కలిగిన నాయకులు పార్టీలో ఉన్నారు..
- ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
- మిగిలిన జిల్లాలకు
- ఖమ్మం ఆదర్శం కావాలి
- స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల శిక్షణలో వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,
- ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్తగూడెం: ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రజా ప్రతినిధికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రిటైర్డ్ డీఎల్పీవో క్రిష్టఫర్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు వారి విధులు, నిధులు, హక్కులు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో సుమారు 135 మంది ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారని, వీరిని అధికార, ఇతర పార్టీల నాయకులు ప్రలోభాలకు గురిచేసినప్పటికీ కేవలం 18 మంది మాత్రమే పార్టీని విడిచి వెళ్లారన్నారు.
నిబద్ధత, నిజాయితీ కలిగిన ప్రజా ప్రతినిధులంతా తనవెంట, పార్టీలోనే ఉన్నారని గుర్తుచేశారు. బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులచే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. ఈ విషయంపై తాము కోర్టుకు సైతం వెళ్లామని గుర్తుచేశారు. త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందన్నారు. కొందరు ఇతర పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులను ప్రలోభపెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి నాయకులను చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుందన్నారు.
అధికారం, పదవులు శాశ్వతం కాదని, తనను ఎన్ని మానసిక ఒత్తిళ్లకు గురిచేసినా, మానసిక క్షోభ పెట్టినా పార్టీని విడిచిపెట్టేది లేదన్నారు. ఎంపీగా ఎన్నికైన తరువాత మొదటి దఫా వచ్చిన ఎంపీలాడ్స్ నిధులు రూ.5 కోట్లు ఎంపీటీసీలకు కేటాయించానని, రెండోసారి వచ్చే ఎంపీలాడ్స్ నిధులను ఇతర ప్రజా ప్రతినిధులకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలి:
పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులుగా గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని జిల్లా నలుమూలలా చాటి చెప్పారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానం గెలుచుకోవడం సామాన్య విషయం కాదన్నారు. ఎంపీగా ఎన్నికైన తరువాత పొంగులేటి గతంలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ తిరగని విధంగా తిరుగుతున్నారు. వివిధ స్థానాల్లో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు మనం ఏ మేరకు పనిచేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలని, శీనన్నను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలనే భావన కలగాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు వాటిని నెరవేర్చట్లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. ఆగస్టు 15న ఆర్భాటంగా ప్రారంభించినా జిల్లాలో దళితులకు భూమి పంచిన దాఖలాలు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా, మండలాల్లో దళిత సోదరులను సమీకరించి ఆందోళనలు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. గిరిజనులు, బీసీల సమస్యలపై మేనిఫెస్టోలో పొందుపరిచినా ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చుపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
వైఎస్సార్‌సీపీని బలమైన పార్టీగా శీనన్న నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లాలని, ప్రతిరోజు పార్టీ కోసం రెండుమూడు గంటలు కేటాయించాలని, ప్రజలకు దగ్గరై ప్రజా నాయకులుగా ఎదిగితే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరిస్తారన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను మాయమాటలు, మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. తనను సైతం ప్రలోభాలు పెట్టినా, ఇబ్బందులకు గురిచేసినా కమ్యూనిస్టు భావాలతో ప్రజా మనిషిగా, నీతి నిజాయితీకి కట్టుబడి బి-ఫాం తీసుకున్న పార్టీని అభివృద్ధి చేయాలని, పార్టీని నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయాలని భావించి పార్టీలోనే కొనసాగుతున్నానన్నారు. అధికారం లేకపోయినా నమ్ముకున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బలమైన శక్తిగా తెలంగాణలో వైఎస్సార్‌సీపీ ఎదుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జె.వి.ఎస్.చౌదరి, షర్మిలా సంపత్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండు రంగాచారయ్యలు, పాలేరు, ఇల్లెందు, వైరా, మధిర నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సాధు రమేశ్‌రెడ్డి, గుగులోత్ రవిబాబునాయక్, బొర్రా రాజశేఖర్, తూమాటి నర్సారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి భీమా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు ఎం.డి.ముస్తఫా, జిల్లా అధికార ప్రతినిధులు మందడపు వెంకటేశ్వర్లు, గుండా వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి ముత్తయ్య, రైతు విభాగం, వాణిజ్య విభాగం, ఎస్టీ సెల్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు, ధారా యుగంధర్, గుగులోతు బాబు, తోట రామారావు, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, జిల్లా నాయకులు బండి సత్యనారాయణ, తూమాటి వెంకన్న, జూపల్లి రమేష్, జాలె జానకిరెడ్డి, కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు భీమా శ్రీవల్లి, కంభంపాటి దుర్గా ప్రసాద్, తాండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు నేనున్నా..
Published Sun, Apr 19 2015 4:15 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM
Advertisement
Advertisement