ప్రశాంతంగా ఎంసెట్ | EAMCET registers over 93 per cent attendance | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎంసెట్

Published Fri, May 23 2014 12:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

EAMCET registers over 93 per cent attendance

ఆలంపల్లి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని రెండు సెంటర్లలో గురువారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు నిబంధన పెట్టడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కొందరు ఐదు పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. వికారాబాద్ ఎంసెట్ రీజనల్ కో-ఆర్డినేటర్, ఎస్‌ఏపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రకాష్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.
 
 రెండు సెంటర్లలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్ష
 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఉదయం 10గంటలకు వికారాబాద్‌లోని రెండు  సెంటర్లలో నిర్వహించారు. మొత్తం 1,012 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 963 మంది హాజరయ్యారు. రెండు సెంటర్లలో కలిసి 49 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ధన్నారం అన్వర్ ఉలూమ్ కళాశాల పట్టణానికి దూరంగా ఉండడంతో విద్యార్థులు ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్‌ఏపీ కళాశాలలో, అన్వర్ ఉలూం కాలేజీలో మెడిసిన్ విభాగం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 694మంది విద్యార్థులకు 655 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరయ్యారు.  

 ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయిన విద్యార్ధులు
 అన్వర్ ఉలూమ్ కళాశాలలో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు జ్యోతి అనే విద్యార్థినితోపాటు మరో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

 టెంటు కూడా వేయలేదు..
 వికారాబాద్ అన్వర్ ఉలూమ్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద కనీసం షామియానా కూడా ఏర్పాటు చేయలేదు. ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. కళాశాలకు దూరంగా పంటపొలాల్లో ఉన్న చెట్ల కింద గడిపారు.  

 సీఎంఆర్‌లో పరీక్ష రాసిన 3,250 మంది..
 మేడ్చల్: మండలంలోని కండ్లకోయ సీఎంఆర్ గ్రూపు కళాశాలలోని నాలుగు సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సీఎంఆర్‌ఐటిలో ఒకటి, సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలో ఒకటి, సీఎంఆర్ సెట్‌లో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. సెట్ కళాశాలలోని రెండు సెంటర్లలో 500 మంది విద్యార్థుల చొప్పున, మిగతా సెంటర్లలో 450 మంది విద్యార్థుల చొప్పున 3,250 విద్యార్థులు  పరీక్ష రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement