నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి
నాంపల్లి: నేర రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీ కుమార్ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగర ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో రెండు రోజుల పాటు విద్యార్థులకు చిత్రలేఖనం, కార్టూన్, వక్తృత్వం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కమిషనర్ మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది అమరులయ్యారని వివరించారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతి ఏటా ట్రాఫిక్ విభాగం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభను కనబరిచారని, చిన్నారులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ ప్రదానోత్సవంలో అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ జితేందర్, ట్రాఫిక్ డీసీపీలు సుధీర్ బాబు, శ్యామ్ సుందర్, సీనియర్ అధికారులు పాపయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.