గుడ్డు బందేనా? | egg supply tender end of this month | Sakshi
Sakshi News home page

గుడ్డు బందేనా?

Published Wed, Sep 24 2014 2:05 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

egg supply tender end of this month

ఖమ్మం: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా టెండర్ ఈనెలతో ముగియనుంది. వచ్చే రెండేళ్ల కోసం ఇప్పటికే టెండర్ పూర్తికావాల్సి ఉన్నా..నేటికీ ఓ కొలిక్కి రాలేదు. స్థానిక, స్థానికేతరుల మధ్య తలెత్తిన వివాదంతో ఈనెల చివరి వరకు టెండర్లు జరిగే అవకాశం లేదు. అక్టోబర్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా పరిస్థితి ఏంటో అర్థంకాక కేంద్రాల కార్యకర్తలు, ఐసీడీఎస్ ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు.

 సెప్టెంబర్‌తో ముగియనున్న సరఫరా గడువు
 మాతాశిశు సంరక్షణతోనే శిశు మరణాలు నివారించవచ్చని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, బాలామృతం వంటివి సరఫరా చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 23 ప్రాజెక్టుల పరిధిలో 3,670 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,218 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 1.8 లక్షల మంది బాలబాలికలు ఉన్నారు.

 గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 5 సంవత్సరాలలోపు బాలబాలికలకు వారంలో నాలుగు రోజులు కోడిగుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు ప్రతి నెలకు సుమారు 25 లక్షల కోడిగుడ్లు, 50 వేల కేజీల కందిపప్పు, 17 వేల కేజీల శనగలు సరఫరా చేయాలి. వీటి సరఫరా కోసం టెండర్లు నిర్వహిస్తారు. వీటిలో శనగలు, కందిపప్పు సరఫరా గడువు మరి కొద్దినెలలు ఉండగా.. కోడిగుడ్ల సరఫరా టెండర్ గడువు మాత్రం సెప్టెంబర్‌తో ముగుస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఐసీడీఎస్ అధికారులు గత నెల కోడుగుడ్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానించారు.

స్థానికులే టెండర్లలో పాల్గొనాలని నిబంధన విధించారు. కానీ స్థానికేతరులు పలువురు టెండర్లు వేసేందుకు ముందుకు రాగా ఐసీడీఎస్ అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి వారైనా టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. కావాలనే తమను పక్కన పెడుతున్నారని కోర్టును ఆశ్రయించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన భూపతి ఎంటర్ ప్రైజెస్ యజమాని వి. లక్ష్మీనారాయణ అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి టెండర్లు వేసే అవకాశం ఉంది.. కావాలనే తమ క్లైంట్ టెండర్లు స్వీకరించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియను కొనసాగించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.  కోర్టు నుంచి తీసుకువచ్చిన ఆర్డర్‌తో సదరు కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ టెండర్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈనెలతో కోడిగుడ్ల సరఫరా గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థంకావడం లేదు.

 జిల్లాలోనే ఈ పరిస్థితి ఎందుకు..?
 తెలంగాణ జిల్లాలో ఎక్కడా లేని విధంగా టెండర్ల ప్రక్రియ ఇక్కడే ఎందుకు వివాదంలో చిక్కుకుందనేది చర్చనీయాంశమైంది. కోడిగుడ్ల సరఫరాలో అవకతవకలు జరిగాయని, మారుమూల ప్రాంతాలకు గుడ్లు సరఫరా కావడంలేదనే విమర్శలు వచ్చాయి. గతంలో పనిచేసిన జిల్లా అధికారుల ఆదేశాల మేరకే స్థానిక కాంట్రాక్టర్లే టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన పలువురు కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై తమకు అవకాశం కల్పించడంలేదని ఇతర జిల్లాలవారు ఆరోపిస్తున్నారు.
 
 పలుచోట్ల సకాలంలో కాని సరఫరా
 జిల్లాలోని గిరిజన మారుమూల గ్రామాల్లో సకాలంలో గుడ్లు సరఫరా చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సుదిమళ్ల ప్రాజెక్టు పరిధిలో రెండు నెలలుగా గుడ్ల సరఫరా చేయటం లేదని ఆ ప్రాంత ప్రజలు ఇటీవల ఆందోళనకు దిగారు. అశ్వాపురం మండలంలో గుడ్లు చిన్నగా ఉన్నాయని, కొత్తగూడెం, జూలూరుపాడు, తిరుమలాయపాలెం, పాల్వంచ, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో సకాలంలో గుడ్లు సరఫరా చేయడంలేదని, మురిగిపోయిన గుడ్లను సరఫరా చేశారని, ఉడక బెడితే పొట్టు రావడంలేదని, గుడ్లలో నుంచి దుర్వాసన వస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి.

అయితే గతంలో సక్రమంగా గుడ్లు సరఫరా చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లకు ఈసారి టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారా.. ? లేదా  అనేదానిపై కూడా చర్చ సాగుతోంది. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందిం చి గతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుడ్లు సరఫరా చేయని వారికి టెండర్లలో అవకాశం కల్పించవద్దని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు జారీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement