అంగన్‌వాడీల్లో ఆడిట్‌     | Audit In Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ఆడిట్‌    

Published Sat, Aug 11 2018 11:26 AM | Last Updated on Sat, Aug 11 2018 11:26 AM

Audit In Anganwadi  - Sakshi

అశ్వాపురం మండలం బట్టుమల్లారం అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామసభలో వివరాలు వెల్లడిస్తున్న సామాజిక తనిఖీ బృందం(ఫైల్‌)

అశ్వాపురం ఖమ్మం : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్డు, మధ్యాహ్న భోజనం, బాలామృతం, చిన్నారులకు ఆటపాటలతో ప్రీ స్కూల్‌ విద్య తదితర సేవలు అందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు సేవలు అందడం లేదని, అంగన్‌వాడీ టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పౌష్టికాహారం పక్కదారి పడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తోంది. లబ్ధిదారులకు పౌష్టికాహారం అందుతున్న తీరును తెలుసుకోనుంది. జిల్లాలో రెండు విడతలుగా రెండు బృందాలు ఈ నెలాఖరు వరకు తనిఖీ చేపట్టాలని నిర్ణయించింది.  

155 కేంద్రాల్లో..  

జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,434 ప్రధాన, 626 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 8,500 మంది గర్భిణులు, 5వేల మంది బాలింతలు, 3 సంవత్సరాల లోపు పిల్లలు 55వేల మంది, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 27వేల మంది అంగన్‌వాడీ సేవలు పొందుతున్నారు. కాగా జిల్లాలో 155 అంగన్‌వాడీ కేంద్రాలను సామాజిక బృందం తనిఖీ చేయనుంది. మొదటి విడతలో 75, రెండో విడతలో 80 కేంద్రాల్లో తనిఖీ చేపట్టనున్నారు.

తనిఖీ చేయనున్న కేంద్రాలను డైరెక్టరేట్‌ నుంచి ఎంపిక చేశారు. జిల్లాలో ఇల్లెందు ప్రాజెక్ట్‌లో 6, దుమ్ముగూడెం 34, టేకులపల్లిలో 8, అశ్వారావుపేటలో 6, బూర్గంపాడులో 24, చండ్రుగొండలో 34, చర్లలో 10, దమ్మపేటలో 11, మణుగూరులో 19, పాల్వంచలో 3 కేంద్రాల్లో సామాజిక తనిఖీ జరగనుంది. తనిఖీలో ఫిబ్రవరి 2018 నుంచి జూలై 2018 ఆరు నెలల కాలంలో అందించిన సేవలపై ఆరా తీస్తారు. ఈ నెల 7 నుంచి ఇల్లెందు ప్రాజెక్ట్‌లో సామాజిక తనిఖీ ప్రారంభమైంది.  

సేవల్లో పారదర్శకతే లక్ష్యంగా..  

అంగన్‌వాడీ సేవల్లో పాదర్శకత కోసం ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పౌష్టికాహారం సరఫరా చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని, కేంద్రాలకు పిల్లలు, గర్భిణులు, బాలింతలు హాజరుకాకపోయినా, హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసి పౌష్టికాహారం పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి ఏడాది 10 శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌ నెలలో జిల్లాలో 61 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ ఏడాది 155 కేంద్రాల్లో తనిఖీ చేపడుతున్నారు.  

14 అంశాల పరిశీలన  

సామాజిక తనిఖీ బృందం అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి కేంద్రం నిర్వహణ, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల తీరును పరిశీలిస్తుంది. లబ్ధిదారుల హాజరు, ఏయే నెలల్లో, ఎంత పౌష్టికాహారం సరఫరా అయింది, లబ్ధిదారులకు ఎంత పంపిణీ చేశారు? తదితర 14 రకాల అంశాలను పరిశీలిస్తారు. గ్రామంలో గృహ సందర్శన చేపట్టి గర్భిణులు, బాలింతలు, 0 నుంచి 6 నెలలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు, స్థానికులతో మాట్లాడి అంగన్‌వాడీల ద్వారా గుడ్లు, బియ్యం, పప్పు, బాలామృతం, భోజనం, పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారో లేదా, అంగన్‌వాడీ సేవలు అందుతున్నాయా లేదో తెలుసుకుంటారు.

తనిఖీ పూర్తయ్యాక ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆవరణలో గ్రామసభ నిర్వహించి తనిఖీలో వెల్లడైన వివరాలను, సమస్యలను వివరించి, లబ్ధిదారులు, స్థానికులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం నివేదికను మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారికి, డైరెక్టరేట్‌కు అందజేస్తారు. ఈ నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటారు.  

ఎంపిక చేసిన కేంద్రాల్లో..  

జిల్లాలో 155 అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న పౌష్టికాహారం, సేవలపై తనిఖీ చేస్తారు. ఈ నెల 7న ఇల్లెందు ప్రాజెక్ట్‌లో తనిఖీ ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో తనిఖీ నిర్వహిస్తారు. సామాజిక తనిఖీ బృందానికి రికార్డులు అందజేయాలని సీడీపీఓలను ఆదేశించాం. తనిఖీ పూర్తయ్యాక నివేదికలు అందజేస్తారు. 

–ఝాన్సీ లక్ష్మీబాయి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement