తెలంగాణలో తొలి కరోనా మరణం | Eight Corona Positive Cases Rise In Telangana Says Etala Rajender | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తొలి కరోనా మరణం

Published Sun, Mar 29 2020 1:10 AM | Last Updated on Sun, Mar 29 2020 1:13 AM

Eight Corona Positive Cases Rise In Telangana Says Etala Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. ఇప్పటివరకు కరోనా మరణాలు నమోదుకాకపోవడంతో ప్రజల్లో వైరస్‌పై భయమున్నా, మరణాలు ఉండవన్న ధీమాతో ఉన్నారు. తాజాగా కరోనా మరణం నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మృతి చెందిన వ్యక్తి (74)కి సంబంధించి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇటీవల ఆయన ఢిల్లీలో ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లి ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చాడు. రెండ్రోజుల తర్వాత జలుబు, జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో మందులు కొని వేసుకున్నాడు. ఈనెల 26 రాత్రి 10 గంటల సమయంలో తీవ్రమైన జ్వరంతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు లక్డీకాపూల్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్సపొందుతూ మృతి చెందాడు. అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈనెల 27న మృతదేహం నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స సమయంలో ఆయన తీవ్ర న్యుమోనియా లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిసింది. (కరోనా: వ్యాక్సిన్‌ తయారీకి కీలక అధ్యయనం!)

నాలుగు కుటుంబాలకు కరోనా..
శనివారం రాష్ట్రంలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 67కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదు కాగా, ఈ రెండు రోజుల్లోనే 22 కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా ఒక్క హైదరాబాద్‌లోనే నాలుగు కుటుంబాలకు కరోనా వైరస్‌ సోకింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి కుటుంబంలో ఏకంగా ఆరుగురికి కరోనా సోకింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన నాంపల్లికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి కూడా కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. దోమలగూడకు చెందిన ఓ వైద్యుడి కుటుంబంలో ఆయన తల్లికి కూడా కరోనా సోకింది. ఇప్పటికే మణికొండలో కొడుకు నుంచి తల్లికి, కోకాపేటలో ఓ వ్యక్తి నుంచి అతడి భార్యకు, సికింద్రాబాద్‌లో భార్యాభర్తల నుంచి కుమారుడికి, కొత్తగూడెంలో కొడుకు నుంచి తండ్రికి, వారి పనిమనిషికి కూడా కరోనా సోకింది.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 కుటుంబాలకు కరోనా సోకింది. కుటుంబసభ్యుల మధ్యే ఎక్కువగా కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. కాగా, శనివారం నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్న నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోవారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.  కాగా, ఈ నెల లండన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి 22న కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. అతడు మియాపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో రెండు రోజుల పాటు బస చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. దీంతో అతడిని కలసిన హోటల్‌ సిబ్బందిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు. 

10 మందికి నయం..! 
రాష్ట్రంలో నమోదైన 67 పాజిటివ్‌ కేసుల్లో చికిత్స పొందుతున్న 10 మందికి నెగెటివ్‌ వచ్చి నయమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 67 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణకాగా,ఇప్పటికే తొలి కేసుకు సంబంధించిన రోగి డిశ్చార్జిఅయ్యాడు. ఇటలీ నుంచి వచ్చిన అశ్వాపురానికి చెందిన యువతికికూడా పాజిటివ్‌ రాగా,ప్రస్తుతం ఆమెకు కూడా నెగెటివ్‌ వచ్చింది. అలాగేమరో 8 మందికి కూడా తాజాగా నెగెటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వీరిని ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వెల్లడించాయి. 

బయట తిరిగితే కేసులే : మంత్రి ఈటల 
రాష్ట్రంలో కరోనాసోకడంతో వృద్ధుడు చనిపోయినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖైరతాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి ఢిల్లీకి మార్చి 14న ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లాడని, తిరిగి 17న హైదరాబాద్‌కు వచ్చాడని, మార్చి 20న తీవ్రజ్వరంతో బాధపడుతుడటంతో ఓఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడని మంత్రి వెల్లడించారు. సైఫాబాద్‌ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారని, అక్కడ పరీక్షల సందర్భంగా నమూనాలుసేకరించి పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలిందన్నారు. ఆయన భార్య, కుమారుడిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలివ్వాలని ఆస్పత్రులనుకోరినట్లుతెలిపారు. హైదరాబాద్‌లో ఎలాంటిరెడ్‌ జోన్లులేవన్నారు. ప్రస్తుతం కరోనాపాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్న వారిలోఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

శనివారం నమోదైన ఆరుకేసుల్లో ప్రయాణ చరిత్ర ఉన్న కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివల్లే ఏడెనిమిదిమందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. మతపరమైన కార్యక్రమాలను ఇంటికే పరిమితం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిలు, మసీదులు,మందిరాలు కరోనా వ్యాప్తి చెందే కేంద్రాలుగా మారొద్దన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు బయటతిరిగితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. క్వారంటైన్‌లో 13 వేల మంది ఉంటే, వారి సంఖ్య రోజురోజుకూతగ్గుతోందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పనికోసం వచ్చే వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ప్రజారోగ్య డైరెక్టర్‌శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డితదితరులతో తదుపరి కార్యాచరణపై సమీక్షించారు. 

గైడ్‌లైన్స్‌ ప్రకారమే అంతిమ సంస్కారాలు 
గాంధీఆస్పత్రి : కరోనా వైరస్‌ సోకి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు తెలిసింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గాంధీ మార్చురీ వైద్యుల పర్యవేక్షణలో మృతదేహానికి ప్రత్యేక రసాయనాలు పూసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేశారు. అనంతరం పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ దుస్తులు తొడిగారు. ప్రత్యేకంగా రూపొందించిన లీక్‌ ఫ్రూఫ్‌ సంచిలో మృతదేహాన్ని ఉంచి జిప్‌ వేశారు. మరోసారి హైపోక్లోరైడ్‌ ద్రావణంతో సంచిని శుభ్రం చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే అనుమతించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని గాంధీ మార్చురీ నుంచి తరలించారు. 

ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై అధికారుల ఆగ్రహం.. 
ఇటీవల మూడు పాజిటివ్‌ కేసుల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరించిన తీరుపై వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మండిపడుతున్నాయి. మొదట్లో కర్ణాటకకు చెందిన వ్యక్తి ఇక్కడకు వచ్చి ఓ ఆస్పత్రిలో చేరాడు. అతడికి కరోనా లక్షణాలున్నాయని తెలిసినా వైద్య ఆరోగ్య శాఖకు తెలపలేదు. మరో ఆస్పత్రికి చెందిన ఇద్దరికి, వారి ద్వారా మరో కుటుంబసభ్యుడికి వైరస్‌ సోకింది. వారి వివరాలను కూడా సంబంధిత ఆస్పత్రి వర్గాలు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. తాజాగా చనిపోయిన వ్యక్తికి పాజిటివ్‌ అని తేలింది. అతడి వివరాలు ఆరోగ్య శాఖకు తెలపకుండానే ఆస్పత్రి చికిత్స చేసింది. ఇలా తమ నిబంధనలను అనేక ఆస్పత్రులు పాటించట్లేదని సచివాలయానికి చెందిన ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఇలా ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ, నర్సింగ్‌ హోమ్స్‌లో ఎందరు సాధారణ జలుబు, దగ్గు, జ్వరం పేరుతో చికిత్స పొందుతున్నారో అన్న అనుమానాలు అధికారులను వేధిస్తున్నాయి. అమెరికాలో అన్ని కేసులు నమోదు కావడం వెనుక ప్రధాన కారణం అక్కడ లక్షణాలున్న ప్రతి కేసును గుర్తించి, పరీక్షలు చేయడం వల్లేనని చెబుతున్నారు. ఇక్కడ మాత్రం విదేశీ ప్రయాణికులతో కాంటాక్ట్‌ ఉన్న వారిని, అది కూడా లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలను ప్రభుత్వానికి చెప్పకపోవడం వల్లేనన్న విమర్శలున్నాయి. ఇది కొంప ముంచుతుందని వైద్యాధికారులు అంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement