సాక్షి, కాజీపేట: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పలు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎరవేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 10 రోజులు మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఇప్పటినుంచే ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఎన్నికలకు మూడు, నాలుగు రోజుల ముందే హడావిడి చేసే నేతలు, మండల, ద్వితీయస్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం సుమారు నెలరోజుల ముందునుంచే హంగామా చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాజిక నేతలు, విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలు అంటే శాంతియుత వాతావరణంలో అభ్యర్థులు చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ తమతమ గుర్తులకు ఓటేయాలని ప్రచారాలు గతంలో కొనసాగేవి. ప్రస్తుతం అలా కాకుండా సోషల్ మీడియా ప్రచారం కావడంతో అందులో అన్ని పార్టీల కార్యకర్తలు తమ నేతల చిత్రాలు ఏర్పాటుచేసి తమతమ పార్టీల గుర్తులకు ఓటేయాలని హల్‌చల్ చేస్తున్నారు.
రాత్రి విందులు, వినోదాలు...
రాత్రివేళల్లో ఓటర్లు విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి వాతావరణం ఊపందుకుంది. రోజువారీగా ఓ పార్టీకి చెందిన కుల సంఘాలు, ఇరువర్గాల వారిని మచ్చిక చేసుకుంటూ తమ పార్టీకే ఓటేయాలంటూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఇన్ని రోజుల ముందే రాజకీయపక్షాలు నానా హంగామా చేయడంతో ఓటర్లు, ఇతర వర్గాలు సైతం అందరూ ఇచ్చిన విందులు, వినోదాలు స్వీకరిస్తూ ఓటేసే సమయం ఇంకా ఉందని అప్పుడు ఆలోచించుకుద్దామని సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జరుగబోయే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో డిసెంబర్ 11న వెలువడే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.
కొందరు నేతల అత్యుత్సాహం...
పోటాపోటీగా ఎవరికి వారే పార్టీలో చేరాలనుకునే ఆశావహులను, రాజకీయాల్లో అవగాహన లేని కొందరిని రాజకీయాల వైపు మళ్లిస్తూ ఉనికిని చాటుకునేందుకు కొందరు పార్టీల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. గెలిస్తే తమకే పలుకుబడి ఇవ్వాలని, నాలుగు రాళ్లు సంపాదించుకుందామనే కొందరు నాయకులు చేరికలు చేపడుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు సొంత పార్టీలోని వారినుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు వినికిడి. గతంలో జరిగిన రాజకీయాల్లో ప్రతి గ్రామంలో ఓ పార్టీకి ఓ గ్రూపు ఉండేది. ఆయా పార్టీల కార్యకర్తలు తమ పార్టీలకు చెందిన అభ్యర్థులు వస్తేనే ప్రచారంలో చురుగ్గా పాల్గొనేవారు. లేకుంటే ఇంటి వద్దే తమ వ్యక్తిగత పనులను చేసుకునేవారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న ప్రలోభాలకు పలువురు గురై అక్కడి పార్టీ వారు ఈ పార్టీలో ఇక్కడి పార్టీ వారు ఆ పార్టీలోకి వెళ్తూ అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment