సాక్షి, కాజీపేట:నామినేషన్ల ఉపసంహరణల పర్వం పూర్తయింది. బరిలో ఉండేదెవరో తేలిపోయింది. దీంతో ప్రచారం ఊపందుకోవడంతో జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. మద్యం, డబ్బుల పంపిణీతో పాటు కుల రాజకీయాలు చేయడంలో నాయకులు తలమునకలైపోయారు. దొరికితే దొంగ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ సిబ్బంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నించే పార్టీలు, నాయకులకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ కఠిన నిర్ణయాలు అమలుచేస్తుంది.
ఎన్నికల్లో ఎవరైనా జాతి, మత, కుల, భాష, సమాజం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడితే సెక్షన్ 125 ఆర్‌పీ చట్టం 1851, 153ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, జరిమాన విధిస్తారు. ఇచ్చినా.. తీసుకున్నా.. ఓటుకోసం మద్యం, డబ్బులు, ఇతర వస్తువులు ఇచ్చినా తీసుకున్నా ఇద్దరు నేరస్తులే. సెక్షన్ 171 బీ, 171 ఈ, 171 హెచ్ ప్రకారం లంచంగా పరిగణించి ఏడాదికాలం పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ ఎన్నికల్లో నిఘా కళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్లు, నాయకులు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రలోభాలకు లొగకుండా ఓటర్లు నీతి, నిజాయితీ కలిగిన నాయకులనే ఎన్నుకోవాలి. ప్రలోభాలకు గురిచేస్తూ పట్టుబడితే భారీమూల్యం తప్పదని గుర్తుపెట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment