సాక్షి, వరంగల్ రూరల్: ఒకరు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌లో పూరీలు చేస్తే... మరొకరు కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముతున్నారు..ఇంకొకరు టీకొట్టులో టీ పోస్తున్నారు..ఇలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లోకసభ సభ్యుడిగా పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థులు వింత ప్రచారంలో పోటీ పడుతున్నారు.
జనాల మెప్పు, మార్కుల కోసం నాయకులు పడే పాటు అన్నీ..ఇన్నీ కావు. కళాకారుల నృత్య ప్రదర్శనలు డప్పు వాయిధ్యాల నడుము వినూత్నంగా అలంకరించిన వాహనాలతో ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచార కోలాహలం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓట్ల వేటలో తీవ్రంగా శ్రమిస్తూ ప్రచార రంగాల్లో వింత పదనిసలు పలికిస్తున్నారు.
వ్యాయామ ప్రచారాలు..
చాలా మంది ఉదయపు నడక ఆరోగ్యకరమని వాకింగ్ చేస్తుంటారు. కొందరు లేవగానే వ్యాయా మం చేస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వాకింగ్ చేసే ప్రదేశాల్లోనూ ప్రచార బాటలు వేస్తున్నారు. సామాన్య ప్రజలతో మమేకమై వ్యాయామాలు, యోగా చేస్తున్నారు. క్రీడా మైదానాల్లోకి చేరి ఓ అభ్యర్థి వారితో కలిసి షటిల్ ఆడి తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
అయ్యా.. నీ ఓటు నాకే...
ప్రతి ఓటరును కలిసేప్పుడు ఆ ఓటు తమకే పడుతోందని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల ముందరకు వెళ్లి అయ్యా.. అమ్మా.. అక్కా.. చెల్లి.. అంటూ అందరినీ అప్యాయంగా పలకరిస్తున్నారు. ఇటీవల వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌లో రైతు కాళ్లు పట్టుకుని ఓటు వేసి గెలిపించాలని ఓ అభ్యర్థి కోరారు. ఇలా ప్రజల నుంచి ఓట్లను పొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
కూరగాయలు అమ్ముతూ..
కూరగాయలు అమ్మే దుకాణం దగ్గరికి వెళ్లి అభ్యర్థులు విక్రయాలు చేస్తున్నారు. హోటల్‌లో పూరీలు చేస్తూ మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రచారంలో భాగంగా తిరుగుతున్న నాయకులు ఆయా పనుల్లో నిమగ్నమై వారి వద్దకు వెళ్లి ఓట్లను అడుగుతున్నారు.
పేరంటాల్లో.. ఓట్ల గలగల
సాధారణ వేళల్లో ఎంత ఖాళీగా ఉన్నా.. పెళ్లిళ్లు, పేరింటాలకు వెళ్లని నాయకులు, ఎన్నికల సమయంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా చెప్పిందే ఆలస్యం, తప్పక హాజరవుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు వచ్చే వీలున్న పేరింటాలకైతే ముందుగానే చేరుకుంటున్నారు. తదనుగుణంగా ఓట్లు గలగల రాలుతాయనే వ్యూహంగా ముందుకు సాగుతున్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల నాడి అంతు చిక్కాలంటే ఎన్నికలయ్యే వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment