సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఏం మల్లయ్య.. హడావుడిగా వెళ్తున్నావ్. ఏంటా తొందరా! అడిగాడు రచ్చబండపై పేపర్ చదువుతున్న కృష్ణయ్య. ‘ఉన్న నాల్గెకరాలు కౌలికిచ్చి కాలు మీద కాలేసుకుని రచ్చబండ మీద కూర్చుని ఎన్నికల రాజకీయాలు చెప్తున్నావ్.. కూలీలు దొరక్క యంత్రాలు సకాలంలో రాక నా తంటాలేమని చెప్పమంటావ్’ అని వేదనతో నిండిన హృదయంతో తన బాధను వెలిబుచ్చాడు మల్లయ్య.‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులవి ఇబ్బందులు చూశావా.. కూరగాయలు అమ్ముతున్నారు.
చిన్న పిల్లలను ఎత్తుకుని మూతులు తుడుస్తూ గల్లీ గల్లీ తిరుగుతున్నారు చూడు మల్లయ్య. గాళ్లు రాజకీయాల కోసం పాట్లు.. నా పాట్లు తిండిగింజలు పండే ఐదెకరాల పొలం తూరిపోతుందని. గొడ్లకు గడ్డి కావాలని. కూలీల కోసం రాత్రి పగలూ తిరుగుతున్నా కృష్ణయ్యా..’ ‘అదేం మల్లయ్య వాళ్లవి రాజకీయాలని అంతగా తీసేస్తివి. గాళ్లదీ వ్యవసాయామే. కాకపోతే రాజకీయ ఎగసాయం. నువ్వు ఎకరాకు రూ.30 వేలు సొప్పున మొత్తం ఐదెకరాలకు రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తవ్. వంద రోజులు కష్టపడతవ్. వాళ్లు నియోజకవర్గానికి మూడు నాల్గు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండ్రు. మూడు నాల్గు కోట్లేమి సరిపోతయ్ మామ’ అంటూ మధ్యలో అందుకున్నాడు పక్కన ఉన్న కొండలు.
నువ్వు ఆగురా అల్లుడు అంటూ మళ్లీ మొదలు పెట్టాడు కృష్ణయ్య. ‘వాళ్లు కోట్లు ఖర్చు చేసి 335 రోజులు పెద్ద పెద్ద నాయకుల చుట్టూ తిరిగిన్ర. వారిని ప్రసన్నం చేసుకుని 30 రోజుల ఎన్నికల పంట వేస్తే అది చేతికందే వరకు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడు. ఎన్నికలు రాగానే దేశం గాని దేశాల్లో జాబులు, యాపారాలు వదిలేసి మరీ ఇక్కడ ఎవసాయం చేయడానికి వచ్చారటా’ అంటూ మనస్సులో మాటను చెప్పేశాడు కృష్ణయ్య. ‘అవును ఒక్కసారి వాళ్ల పంట పండితే చాలు ఇక జీవితంలో మళ్లీ ఏ ఎవుసం చేయాల్సిన పని లేదట.. నిజమేనా’ అని సందేహం వెలిబుచ్చాడు మల్లయ్య. ‘అలా అని అందరూ కాదు. వాళ్లు మాత్రం ఏం చేస్తరు. ఓటరు ఓటును అమ్ముకుంటుంటే అంతేనంటావా.. ఏమోలే మా మేస్త్రీ దొరకడంలే. వాళింటిదాక పోయొస్తా’ అంటూ మల్లయ్య వెళ్లి పోవడంతో కృష్ణయ్య మళ్లీ పేపర్‌లో తలదూర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment