రెండు నెలల్లో ‘విద్యుదాఘాత’ పరిహారం
రెండు నెలల్లో ‘విద్యుదాఘాత’ పరిహారం
Published Sun, Jan 3 2016 5:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM
►జాప్యం జరిగితే డిస్కంలు 12 శాతం వడ్డీ చెల్లించాలి
►విద్యుదాఘాత మరణాలకు పరిహారం పెంపు
►రెగ్యులేటరీ కమిషన్ కొత్త నిబంధనలు అమల్లోకి
►మనుషులకు రూ.4 లక్షలకు పెరిగిన ఎక్స్‌గ్రేషియా
►పశువులకు రూ.40 వేలకు పెరిగిన పరిహారం
సాక్షి, హైదరాబాద్: విద్యుదాఘాతం మరణాలకు పరిహారం చెల్లింపుల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇక ఏమాత్రం జాప్యం చేయడానికి వీల్లేదు. మృతుల కుటుంబాలు/ మూగజీవాల యజమానులు దరఖాస్తు చేసుకున్న నెల ముగిసిన నాటి నుంచి మరో రెండు నెలల గడువులోపు (ఉదాహరణకు జనవరిలో ఏ తేదీన దరఖాస్తు చేసినా.. ఆ నెల ముగిసిన తర్వాత రెండు నెలల్లోపు) పరిహారం చెల్లించాలి. ఒకవేళ ఆలస్యం జరిగితే 12 శాతం వార్షిక వడ్డీతో సహా పరిహారం చెల్లించాల్సిందే.
అదేవిధంగా విద్యుదాఘాతంతో మరణించే వ్యక్తులు, మూగజీవాలకు ఇకపై రెట్టింపు పరిహారం ఇవ్వనున్నారు. ఈమేరకు విద్యుదాఘాత మరణాల పరిహారంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీఎస్‌ఈఆర్‌సీ) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై మృతుల కుటుంబాలు, రైతు సంఘాలు, వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.
పరిహారం చెల్లింపు ఇలా..
విద్యుదాఘాతంతో విద్యుత్ శాఖేతర వ్యక్తుల కుటుంబాలకు చెల్లించే రూ. 4 లక్షల పరిహారాన్ని రెండుగా విభజిస్తారు. రూ.50 వేలు నగదు రూపంలో, మిగిలిన రూ.3.50 లక్షలను కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంకులో ఐదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లించేలా ఏర్పాట్లు చేస్తారు. అంత మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తే.. మిగిలిన రూ.3.50 లక్షలను సైతం నగదు రూపంలో చెల్లించవచ్చు. అదేవిధంగా మృతుల కుటుంబీకులంతా 60 ఏళ్లకు పైబడిన వారున్నా మొత్తం నగదు రూపంలో చెల్లించవచ్చు. మూగ జీవాలకు సంబంధించిన పరిహారం పూర్తిగా నగదు రూపంలోనే చెల్లిస్తారు.
దరఖాస్తు ఇలా..
విద్యుదాఘాత మరణాల పరిహారం కోసం ఇకపై ఎన్నో రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. దీన్ని నియంత్రణ కమిషన్ సరళీకృతం చేసింది. దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిస్కంలను ఆదేశించింది. విద్యుదాఘాతంతో మరణించిన 24 గంటల్లోపు స్థానిక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏఈ)కు మౌఖికంగా/ రాతపూర్వకంగా/ ఎస్‌ఎంఎస్ రూపంలో ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చు. బాధిత కుటుంబాల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు డిస్కంలు వెబ్‌సైట్ ఏర్పాటు చేయనున్నాయి.
మృతిచెందిన వ్యక్తుల విషయంలో ఎఫ్‌ఐఆర్, పంచనామా, పోస్టుమార్టం, డెత్ సర్టిఫికెట్, వారసుల సర్టిఫికెట్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలి. మూగ జీవాల విషయంలో మాత్రం స్థానిక సంస్థ నుంచి యాజమాన్య ధ్రువీకరణ పత్రం, వెటర్నరీ వైద్యుడు ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక, పంచనామా నివేదికతోపాటు మృతిచెందిన జంతువు ఫొటోను జత చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు బదులు పైధ్రువీకరణ పత్రాలతో ఏడీఈ కార్యాలయంలో సాధారణ పద్ధతిలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
Advertisement