
నీటిపారుదల శాఖలో ఎమర్జెన్సీ
♦ ఇంజనీర్లకు సెలవులు రద్దు
♦ ఢిల్లీ నుంచి హరీశ్‌రావు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ఎమర్జెన్సీ ప్రకటించారు. శాఖలో ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది సెలవులన్నింటినీ రద్దు చేసినట్లు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. వర్షాలు,చెరువుల పరిస్థితిపై బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి అధికారులతో సమీక్షించారు. వాట్సాప్ ద్వారా మేజర్, మీడియం, మైనర్ విభాగాల సీఈలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినందున చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదముం దని, ఈ దృష్ట్యా ఇంజనీర్లంతా వారి హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండి ప్రతి గంటకు వర్షపాతం నమోదు చేయాలని సూచిం చారు. చెరువుల కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని, సిమెంట్ సంచు లు, ఇసుక బస్తాలు నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. భారీ వర్షాల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. చెరువులు,రిజర్వాయర్లలో ఏ మేరకు నీళ్లు చేరాయో వాటిని నమోదు చేసి జిల్లా అధికారులకు పంపాలన్నారు. రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకొని సహాక చర్యలు చేపట్టాలని చెప్పారు.