
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పదవీ విరమణ వయసు పెంపు డిమాండ్ మళ్లీ తెరపైకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండటం.. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో 62 ఏళ్లకు పెంచడం నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ రిటైర్‌మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగ సంఘాలు.. తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున పెట్టిన డిమాండ్లలో రిటైర్‌మెంట్ వయసు పెంపును ప్రధానంగా చేర్చాయి. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని ప్రభుత్వం పేర్కొందని.. ఇప్పటికైనా దానిని అమలు చేయాలని కోరుతున్నాయి. రెగ్యులర్‌గా నియామ కాలు జరగని పరిస్థితుల్లో రిటైర్‌మెంట్ వయసు పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉద్యోగుల విభజన పేరుతో..
రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసింది. రిటైర్‌మెంట్ వయసు పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తామని కూడా తెలిపింది. కానీ ఇరు రాష్ట్రాల (తెలంగాణ, ఏపీల) మధ్య ఉద్యోగుల విభజన పూర్తికానందున... రిటైర్‌మెంట్ వయసు పెంపు వద్దని, పెంచితే ఆంధ్రా ఉద్యోగులు ఎక్కువ మంది ఇక్కడే ఉండిపోతారని పేర్కొంది. దీంతో అప్పట్లో ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయాయి. తాజాగా ఉద్యోగుల విభజన జరిగి ఏడాది గడిచిపోవడం, అయినా పదవీ విరమణ వయసు పెంపు దిశగా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో.. క్షేత్రస్థాయి ఉద్యోగులు తమ సంఘాలపై ఒత్తిడి పెంచారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు ఎలాగూ ఇక్కడికి వచ్చే అవకాశం లేనందున.. పదవీ విరమణ వయసును పెంచాలని కోరుతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా.. రిటైర్‌మెంట్ వయసు పెంపును ప్రధాన డిమాండ్‌గా ప్రభుత్వం ముందుంచింది.
సగటు జీవితకాలం పెరిగిన నేపథ్యంలో..
మనిషి సగటు ఆయుః ప్రమాణం పెరిగిన నేపథ్యంలో.. పదవీ విమరణ వయసును పెంచాల్సి ఉంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మనిషి సగటు జీవితకాలం ప్రకారమే గతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును నిర్ణయించారు. 1951లో చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం మనిషి సగటు జీవితకాలం 32 ఏళ్లు. అయితే అప్పట్లో ప్రభుత్వోద్యోగి రిటైర్‌మెంట్ వయసును 55 ఏళ్లుగా నిర్ణయించారు. అనంతరం పరిస్థితులు మెరుగుపడి సగటు జీవిత కాలం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో 1979 అక్టోబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 58 ఏళ్లకు పెంచారు. కానీ దీనిపై న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయన్న ఉద్దేశంతో 1983 ఫిబ్రవరిలో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఆర్డినెన్స్ ద్వారా తిరిగి రిటైర్‌మెంట్ వయసును 55 ఏళ్లకు తగ్గించారు. అనంతరం 1885 ఏప్రిల్‌లో ఉద్యోగుల డిమాండ్లను, సగటు జీవితకాలం 55 ఏళ్లకు పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు.. పదవీ విరమణ వయసును మళ్లీ 58 ఏళ్లకు పెంచారు. ఇప్పటివరకు అదే కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మహిళల సగటు జీవితకాలం 73.2 ఏళ్లకు, పురుషుల సగటు జీవితకాలం 69.4 ఏళ్లకు పెరిగిందని... పదవీ విరమణ వయసును పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
పెన్షన్‌కు అర్హత వచ్చే సర్వీసు కూడా లేకపోతే ఎలా?
‘‘ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా ఉంది. వాస్తవానికి 34 ఏళ్లే అయినా రెగ్యులర్ నియామకాలు లేని కారణంగా ప్రభుత్వమే 44 ఏళ్లకు పెంచింది. ఈ నేపథ్యంలో అనేక న్యాయపర వివాదాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులయ్యే వారికి.. పెన్షన్‌కు అర్హత లభించే సర్వీసు కూడా ఉండని పరిస్థితి. పైగా రాష్ట్రంలో నియామకాలకు వార్షిక కేలండర్ లేదు, రెగ్యులర్‌గా నియామకాలు జరగని పరిస్థితుల్లో రిటైర్‌మెంట్ వయసు పెంచాల్సిందే..’’ – కె.రవీందర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్
ఉద్యోగుల ఆకాంక్ష నెరవేర్చాలి
‘‘క్షేత్రస్థాయిలో ఉద్యోగులు కోరుకుంటున్నట్టుగా పదవీ విరమణ వయసు పెంచాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడా అమలుకు చర్యలు తీసుకోవాలి..’’
– సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి..
‘‘రిటైర్‌మెంట్ వయసు పెంచాలని ఉద్యోగులంతా కోరుకుంటున్నారు. జేఏసీ ప్రధాన డిమాండ్లలో ఇదీ ఒకటి. ఈ విషయాన్ని గతంలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలి..’’ – సత్యనారాయణ, టీజీవో ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment