ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలు
ఎండాకాలం దండకారణ్యంలో మావోయిస్టు దళ సభ్యులు ఎన్‌కౌంటర్లలో పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి సీజన్‌లో వేసవికాలం అన్నల పాలిట గడ్డుకాలమే. అయితే.. ఈసారి నిర్బంధం మరింత తీవ్రమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు పోలీసులు, మావోయిస్టుల కాల్పుల ఘటనల్లో మొత్తం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 56 మంది మావోయిస్టులు ఉన్నారు. మిగిలిన వారిని ఇన్ఫార్మర్లుగా భావించి నక్సల్స్ హతమార్చారు. గతంతో పోల్చితే నేలకొరుగుతున్న మావోయిస్టుల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మావోయిస్టులకు పెట్టని కోట వంటి దండకారణ్యం నెత్తురోడుతుంది. తుపాకీ మోతలతో అడవులు దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టులకు ఎంత గానో పట్టున్న ఇంద్రావతి, శబరి నదీ తీరాల్లో వారికి నష్టం జరగడం కలకలం రేపుతోంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో అడవులు ఆకురాల్చుతాయి. దట్టమైన అడవిలో సుదూర ప్రాంతాలను పరిశీలిస్తూ ముందు కు సాగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అడవులను జల్లెడ పట్టే కార్యక్రమాన్ని పోలీసు బలగాలు విస్త్రృతంగా చేపడుతున్నాయి.
ఈ దాడులను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు మార్చి నుంచి జూన్ వరకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రతి వేసవి సీజన్‌లో పోలీసుల దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా టాక్టికల్ కౌంటర్ ఎఫెన్స్ క్యాంపె యిన్ (టీసీఓసీ) పేరిట దళాలు సంఘటితంగా సంచరించడంతోపాటు ప్రతిచర్యలకు దిగుతున్నారు. దీంతో వేసవిలో సైతం మావోయిస్టులను ఎదుర్కోవడం పోలీసులకు సవాల్‌గానే ఉండేది. కూంబింగ్‌కు సంబంధించిన ఆనవాళ్లు చిక్కితే మావోయిస్టులు మందుపాతర్లు ఏర్పాటు చేస్తారనే ఆందోళన పోలీసు వర్గాల్లో ఉండేది.
అయితే గతంతో పోల్చితే ఈ ఏడాది పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆకురాలే కాలానికి ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడవడంతో పోలీసులు పై చేయి సాధిస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. మావోయిస్టుల ఏరివేతకు గత దశాబ్దకాలంగా హెలికాప్టర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సారి అంతకు మించి శాటిలైట్ చిత్రాలను తీసుకుని వాటిని విశ్లేషించడం, అనంతరం డ్రోన్ కెమెరాలు పంపడం ద్వారా అడవులను అణువణువు జల్లెడ పడుతున్నారు. పోలీసుల గగనతల ఆపరేషన్‌ను ఎదుర్కొని తప్పించుకునేలా వ్యూహం రూపొందించుకోవడంలో మావోయిస్టు దళాలు గందరగోళంలో పడిపోతున్నాయి. దీంతో మావోయిస్టుల వైపు ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోంది. ఈ క్రమంలో భద్రత వ్యవస్థపై మావోయిస్టులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
నదుల్లో రక్తపుటేరులు
గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల తరలింపు, బంధువులకు అప్పగింత ప్రహసనంలా మారింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి పోలీసులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు ఇంద్రావతి నదిలో తేలియాడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. రెండు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. మొత్తం 40 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 12 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలు ఎవరివనే విషయాన్ని గుర్తించలేదు. నదిలో ఉన్న మృతదేహలు ఎలా ఉన్నాయనేది తెలియరాలేదు. మృతదేహాల కోసం మావోయిస్టుల కుటుంబ సభ్యులు గడ్చిరోలి , అహెరీ ఆస్పత్రుల వద్ద రోజుల తరబడి కన్నీళ్లతో పడిగాపులు కాస్తున్నారు.
ఆ ఎనిమిది మంది ఎక్కడ..
40 మంది చనిపోయిన గడ్చిరోలి–బొరియా ఎన్‌కౌంటర్‌లో మృతదేహాల జాడ తెలియని పరిస్థితి ఉండగా.. మరో ఎనిమిది మంది యువకులు ఏమయ్యారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్‌కౌంటర్ జరగడానికి ఒక రోజు ముందు ఆ గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను మావోయిస్టులు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే మరుసటే రోజు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ యువకులు అడవుల్లోకి పారిపోయారా.. ఎన్‌కౌంటర్‌లో మరణించారా.. పోలీసుల అదుపులో ఉన్నారా అనేది తెలియడం లేదు. వారి ఆచూకీ చెప్పాలంటూ గడ్చిరోలీ ఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం నిరసన తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 40 మందిలో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment