నల్లగొండ/చిలుకూరు/కోదాడ టౌన్ :ఇంజినీరింగ్ కళాశాలలకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రామాణికాల ఆధారంగానే ఇంజినీరింగ్ కళాశాలలకు వెబ్ ఆప్షన్లకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 33 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తోంది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారికి వెబ్ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. కానీ జిల్లాలో 40 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా కేవలం ఏడు కాలేజీలకే అఫిలియేషన్లు(యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు పునరుద్ధరణ) ఇస్తూ వెబ్ ఆప్షన్లకు అందుబాటులో ఉంచింది. మిగతా 33 కాలేజీలు జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల మేరకు నిర్వహించడం లేదని పేర్కొంటూ కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు.
తగ్గనున్న సీట్లు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఇంజినీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 17వేల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షల్లో ఇంజినీరింగ్‌కు అర్హత సాధిం చారు. ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాలలో 300 నుంచి 500 వరకు సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా 70శాతం, మేనేజ్‌మెంట్ కోటా 30 శాతం సీట్లు కేటాయించనున్నారు. కాగా ప్రస్తుతం ఎంజీ యూనివర్సిటీతో పాటు ఆరు ఇంజినీరింగ్ కాలేజీలకే అనుమతి లభించడంతో సుమారు 5వేల మందికి మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది.
కోర్టును ఆశ్రయించిన
యాజమాన్యాలు
ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనలో పడిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ హౌస్‌మోషన్‌లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరికొంత మంది సోమవారం కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.
ఆందోళనలో విద్యార్థులు
ఇంజినీరింగ్ కళాశాలల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎం సెట్ ఫలితాలు వెలువడగానే అనేక కళాశాలల యాజమాన్యాలు ఇంజినీరింగ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల ఇంటికి వెళ్లి వారితో ఒప్పందాలు చేసుకున్నాయి. సర్టిఫికెట్లతో పాటు కౌన్సెలింగ్‌కు హాజరైన వారి నుంచి స్క్రాచ్ కార్డులు తీసుకువెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం సదరు కళాశాలలకు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రెండో దశ కౌన్సెలింగ్ వరకైనా అనుమతులు వస్తాయా లేదా అన్న ఆందోళన కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొంది. దీంతో అఫిలియేషన్ల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇంజినీరింగ్ కళాశాలలకు షాక్
Published Mon, Aug 18 2014 2:52 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement