ఉండేనా..పోయేనా..
*నేడు వెల్లడి కానున్న ఎర్రబెల్లి నిర్ణయం?
*నియోజకవర్గ శ్రేణులతో రాజధానిలో సమావేశం
*తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి దక్కకుంటే అంతే...
*ఖమ్మం సభకు వెళ్లే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ
*కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దంటూ దుగ్యాల ప్రయత్నాలు
*శ్రేణులతో కలిసి ‘హస్తం’ ముఖ్యనేతలకు విజ్ఞప్తులు
*ఆసక్తికరంగా మారిన ‘పాలకుర్తి’ రాజకీయాలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజకీయ పయనంపై కొనసాగుతున్న చర్చకు ఒకటిరెండు రోజుల్లో తెరపడే అవకాశం కనపిస్తోంది. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎర్రబెల్లి ఆ పార్టీని వీడుతారా... కొనసాగుతారా అనే అంశంపై శనివారం స్పష్టత వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీ ఏర్పాటు చేసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేస్తున్నారు. అరుుతే కమిటీ ఏర్పాటు ఉంటుందా లేదా అనే విషయం శనివారం తేలుతుందని ఎర్రబెల్లి అనుచరులు చెబుతున్నారు.
దయాకర్‌రావుకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే భవిష్యత్ కార్యాచరణను వెంటనే ప్రకటించే అవకాశం ఉందని వీరు అంటున్నారు. తెలంగాణకు చెందిన ముఖ్య నేతలతో కలిసి ఎర్రబెల్లి శుక్రవారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. సమావేశంలో కమిటీపై నిర్ణయం రాకపోవడంతో అన్ని గ్రామాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి వెయ్యి మంది వరకు శనివారం హైదరాబాద్‌కు రావాలని దయాకర్‌రావు సన్నిహితుల నుంచి శ్రేణులకు సమాచారం అందించింది. శనివారం ఉదయం ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని... సమాచారం ఇవ్వగానే బయలుదేరాలని సూచనలు వచ్చాయి.
తెలంగాణకు పార్టీ కమిటీపై స్పష్టత రానందునే నియోజకవర్గ శ్రేణులతో భేటీ నిర్ణయం తీసుకున్నట్లు ఎర్రబెల్లి సన్నిహితులు పేర్కొంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కొడకండ్లకు చెందిన ఒక సిద్ధాంతిని సంప్రదించి శనివారం మంచి ముహూర్తం ఎప్పుడుందని ఆరాతీసినట్లు తెలిసింది. దీన్ని బట్టి ఎర్రబెల్లి శనివారమే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి మొదలైంది.
తెలంగాణకు తెలుగుదేశం పార్టీ కమిటీ ఏర్పాటు నిర్ణయం రాకుంటే... దీన్ని నిరసిస్తూ ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు సన్నిహితులు అంటున్నారు. మరోవైపు ఖమ్మంలో శనివారం టీడీపీ ప్రజాగర్జన సభ ఉంది. తెలంగాణలో జరుగుతున్న సభ కావడంతో ఈ సభకు దయాకర్‌రావు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సభకు వెళ్లాలనుకుంటే... నియోజకర్గ శ్రేణులతో భేటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
పయనం ఎటు...
సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజకీయ పయనంపై చర్చలు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్ష పదవి దక్కకుంటే పార్టీలో కొనసాగుతారా లేదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో వారం రోజలుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 3న హైదరాబాద్‌లో నియోజకవర్గ ముఖ్య నేతలతో జరిపిన భేటీలోనే పార్టీ మారితో శ్రేణులు తనతో వస్తారా లేదా అనే అంశాన్ని దయాకర్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. అప్పటి నుంచి దయాకర్‌రావు పయనం ఎలా ఉంటుదనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకోవద్దంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం పెట్టి మరీ దయాకర్‌రావును కాంగ్రెస్‌లోకి రానివ్వబోమని ప్రకటించారు. శుక్రవారం ఏకంగా నియోజకర్గంలోని ముఖ్యనేతలతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు.
ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌ను, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి.. దయాకర్‌రావును పార్టీలోకి తీసుకోవద్దని కోరారు. అయితే దయాకర్‌రావు టీడీపీలో కొనసాగుతారని... ఇది జరగకుంటే ఏ పార్టీలోకి వెళ్తారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మొత్తంగా పాలకుర్తిలోని అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి.