టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సైకిల్ దిగి కారెక్కారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఎర్రబెల్లితో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (టీడీపీ) కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావుతో భేటీలో టీఆర్ఎస్ లో చేరాలని ఎర్రబెల్లి నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకాష్ గౌడ్... టీడీపీకి రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.
మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ సభ ముగిసిన తర్వాత హరీష్ రావు నేరుగా హైదరాబాద్ వచ్చారు. అనంతరం ఎర్రబెల్లి, హరీష్ భేటీ అయ్యారు. ఎర్రబెల్లిని టీఆర్ఎస్ లో చేర్చే బాధ్యతను సీఎం కేసీఆర్, హరీష్ రావుకు అప్పగించడంతో ఈ భేటీ జరిగింది. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరినట్లు ఈ భేటీ ద్వారా ఖాయం అయింది. హరీష్ తో భేటీకి ముందు టీడీపీకి దయాకర్ రావు రాజీనామా చేశారు. ఎర్రబెల్లితో పాటు అయితే, ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆయన తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం సహా ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలవ్వడం ఆయనకు ప్రతికూలంగా మారాయి. బీజేపీతో పొత్తులు, అభ్యర్థుల ఖరారు చేయడం అన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు లోకేష్ కనుసన్నల్లోనే జరగడం కూడా ఎర్రబెల్లికి ఏమాత్రం రుచించలేదు.
గ్రేటర్ లో పార్టీ పట్టుకోల్పోవడం, తాజాగా గ్రేటర్ లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై పార్టీ కార్యకర్తలకే కాదు పార్టీ నేతలకూ భారీ షాక్ కు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్ ఫలితాల అనంతరం కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.