అభివృద్ధి కోసమే పునరేకీకరణ
♦ ఏకమై పురోగమిస్తేనే లక్ష్యాన్ని సాధిస్తాం: సీఎం కేసీఆర్
♦ టీఆర్‌ఎస్‌లోకి ఎర్రబెల్లి.. ఆహ్వానించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్న చేరికలను చిల్లరమల్లరగా చూడడం లేదని... వీటిని తెలంగాణ రాజకీయ శక్తుల ఏకకీరణగా చూస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీలో చేరుతున్నారని కాదని.. ఎక్కడ చేరినా తెలంగాణ శక్తి, యుక్తి, సమాజం మొత్తం ఏకోన్ముఖంగా పురోగమించినప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ ఏకీకరణ జరగాలన్నారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వెంట పలువురు వరంగల్ నేతలకు సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
సమైక్య రాష్ట్రంలో వివక్ష, దోపిడీ...
‘‘ఒక శతాబ్ద కాలం నుంచి గ డీల దొరల కాళ్ల కింద నలుగుతూ వందేళ్లు పైబడి తెలంగాణ సమాజం దుఃఖం అనుభవించింది. మా బిడ్డలు బతికితే చాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. సమైక్య రాష్ట్రంలోనూ వివక్ష, దోపిడీకి గురై అనేక ఇబ్బందులుపడ్డాం. గతంలో చాలా ఉద్యమాలు జరిగినా... 2001లో ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ, ఉద్యమంతో 15 ఏళ్లు కష్టాలు పడి, త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. రాజకీయాలు, ఎన్నికలు, గెలుపు, ఓటములు ప్రజాస్వామ్యంలో సాధారణంగా వచ్చిపోతుంటాయి. వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ దిశ, దశ, భవిష్యత్తు ఈ రోజు పడే పునాదిపైనే ఆధారపడి ఉన్నాయి.
ఏపీ రాష్ట్రంలో గొప్ప పరిపాలన చేశామని సీఎంలు చెప్పుకున్నారు. కానీ దళితుల సామాజిక స్థితి, గిరిజనుల జీవితంలో పెద్దగా మార్పులేదు. క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీల బతుకులు ఆగమయ్యాయనుకునే పరిస్థితి. రైతులు అన్నమో రామచంద్రా అని ఏడ్చే పరిస్థితి. బ్రాహ్మణలు కూడా అడుక్కునే పరిస్థితి. సామాజికంగా, ఒక సమాజంగా ఎదిగి, సాధించిన అభివృద్ధి ఏపీలో శూన్యం. వనరులు లేవా అంటే.. ఉన్నాయి. గోదావరిలో ఇంత కరువులో కూడా ఈ ఏడాది 2వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి. అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు. కరెంటుకు ఎంత కష్టపడ్డమో అందరికీ తెలుసు. తెలంగాణలో ఇవన్నీ జరగడానికి వీలు లేదు.
దేశం ముందు తలెత్తుకు నిలబడాలి
తెలంగాణ తానుగా ఒక సమాజంగా నిలబడి అన్ని రకాలుగా గొప్పగా తయారు కావాల్సిన అవసరముంది. అందుకోసమే టీఆర్‌ఎస్‌లోకి దయాకర్‌రావు చేరిక. ఈ చేరికలను కేవలం రాజకీయ చేరికలుగా అర్థం చేసుకోను. తెలంగాణ సమాజంలో బాధ్యత గల ప్రతీ వ్యక్తి కచ్చితంగా ఆలోచించాలి. నిలిచి గెలవాలి. దేశం ముందు తలెత్తుకుని నిలబడాలి. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి. అప్పుడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకం అవుతది. ఇప్పుడిప్పుడే మన ప్రయాణం ప్రారంభమైంది. వరంగల్ జిల్లాకు పెద్ద ఎత్తున లాభం చేకూరబోతోంది. కాళేశ్వరం పూర్తయితే... రెండు పంటలకు సాగునీరు అందుతుంది. అందరం కలసి పనిచేయాలి. ఇక్కడ బస్వరాజు సారయ్య, దయాకర్‌రావు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారున్నారు. వీళ్లందరినీ ఒకే వేదిక మీదకు తెస్తున్న విషయం తెలంగాణ. ఆనాడు రాష్ట్రం కోసం పోరాడాం. తెచ్చుకున్న తెలంగాణ బాగు కోసం నేడు అందరి శక్తినీ ఏకోన్ముఖం చేసి కష్టపడితే తప్ప సాధించలేం. వరంగల్ పట్టణం అభివృద్ధికి ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏటా రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తాం. అందరికీ తాగునీరు అందించేందుకు పాలకుర్తిలో మిషన్ భగీరథ కింద రెండు నెలల్లో శంకుస్థాపనకు వస్తా. రెండేళ్ల తర్వాత వరంగల్ జిల్లా రెండు పంటలు పండించే జిల్లాగా రూపుదిద్దుకుంటుంది.
తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదు: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఎత్తిపోయిందని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా చేతులెత్తేశారని టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తాను రాజకీయ స్వార్థం కోసం పార్టీ మారలేదని... కేవలం పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఏమాత్రం మనుగడ లేదని... అంతా ఆలోచించుకుని, టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్‌ను బలపర్చాలని పిలుపునిచ్చారు. తాను రెండేళ్ల కిందటే టీఆర్‌ఎస్‌లో చేరాల్సి ఉందన్నారు. పాలకుర్తి ప్రజలకు ఏం చేసుకోలేకపోతున్నాన్న బాధ ఉందని.. ఈ మూడేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ను నమ్ముతున్నారని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని చెప్పారు. తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారంద రినీ కలుపుకొని వెళుతూ పాలకుర్తిని అభివృద్ధి చేస్తానన్నారు. దేవాదుల నీటితో పాలకుర్తి చెరువులు నింపాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. గతంలో కేసీఆర్‌ను తిట్టినందుకు బాధపడుతున్నానని, టీడీపీపై తనకు కోపమేమీ లేదని వ్యాఖ్యానించారు.