పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం   | Errabelli Dayakar Rao Speaks About Village Development In Warangal | Sakshi
Sakshi News home page

పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం  

Published Fri, Sep 13 2019 8:13 AM | Last Updated on Fri, Sep 13 2019 9:02 AM

Errabelli Dayakar Rao Speaks About Village Development In Warangal - Sakshi

మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు

సాక్షి, కాటారం: మనం పుట్టి, పెరిగిన ఊరు కన్నతల్లితో సమానమని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం కాటారం మండల కేంద్రంలోని  అయ్యప్ప కల్యాణ మండపంలో సర్పంచ్‌ తోట రాధమ్మ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి  జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు హాజరయ్యారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

గ్రామాలను స్వచ్ఛత దిశగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రమదానాలు నిర్వహించడం, మొక్కలను నాటడం వంటి కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని  సూచించారు. గ్రామాభివృద్ధికి తోడ్పడిన వారికే గ్రామ అవసరాలు, ప్రభుత్వ పథకాల గురించి గ్రామసభలో ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వ్యాధులు బాధ ఉండదని, బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.

ప్రకృతిని నాశనం చేసే వారికి ఎంత ఫైన్‌ విధిస్తే బాగుంటుందని మంత్రి సభలో గ్రామస్తులను అడుగగా వారు రూ.500 అని అనడంతో అమలు చేయండి అని కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రత్యేక కార్యచరణలో భాగంగా ప్రతి గ్రామం ఓ గంగదేవిపల్లిని మించిపోవాలని మంత్రి అన్నారు. 30 రోజుల ప్రణాళికను గ్రామంలో విజయవంతం చేసుకుంటే ఎన్ని నిధులు అడిగిన కేటాయించే బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో వెనకాడేది లేదన్నారు. ప్రతి ఏటా కాటారం గ్రామపంచాయతీకి 1.20కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.3లక్షల మేర రుణం ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర వాటాలతో పాటు మరిన్ని నిధులు సమకూర్చేలా మంత్రి చొరవ చూపాలన్నారు. చెక్‌పవర్‌పై సర్పంచ్‌ల్లో ఇంకా స్పష్టత రాలేదని ఆ అంశాన్ని పునఃపరిశీలించి అధికారాలు ఇస్తే గ్రామపంచాయతీలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.

గ్రామసభలో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్‌డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్‌ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, మహదేవపూర్‌ జడ్పీటీసీ గుడాల అరుణ, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.   

పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
కాటారం: కాటారం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూమి పూజ చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టాపన రాయి వేశారు. కాగా కాటారం గ్రామపంచాయతీ భవనం గత కొంత కాలం క్రితం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నూతన పాలకవర్గం గత కొన్ని నెలలుగా కార్యాలయ నిర్వాహాణ అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచ్‌ తోట రాధమ్మ, పాలకవర్గం సభ్యులు కోరారు. మంత్రి నిధుల మంజూరుకు సూచనాప్రాయంగా అంగీకరించడంతో గురువారం మండల పర్యటనకు వచ్చిన మంత్రి చేతుల మీదుగా భవన నిర్మాణం కోసం భూమి పూజ గావించారు.

అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన భవన నిర్మాణం కూల్చివేతలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా జేసీబీ నడిపి పాత భవనాన్ని కూల్చివేసి పారతో మట్టి ఎత్తి ట్రాక్టర్‌లో పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తోట రాధమ్మ, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్‌భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణిరాకేశ్, పుట్ట మధు, జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్‌డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్‌ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, జక్కు రాకేశ్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement