బస్తీమే సవాల్ ..?!
ఎర్రబెల్లి, కడియంల మధ్య ముదిరిన మాటల యుద్ధం
హన్మకొండ: టీటీడీపీ కన్వీనర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటుంది. పక్షం రోజుల కింద వరంగల్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోగా, నేడు విద్యుత్ సమస్యలపై చర్చకు సిద్ధమంటూ మరోసారి ఎదురెదురుగా నిలిచారు.
అఖిలపక్షం పెట్టండి : ఎర్రబెల్లి
బస్సుయాత్ర సందర్భంగా మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడుతూ... విద్యుత్ సమస్యలకు చంద్రబాబు కారణమని టీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని, టీఆర్‌ఎస్ విమర్శలు నిజమని తేలితే తాము ముక్కు నేలకు రాస్తామని సవాల్ విసిరారు. రూ.250 కోట్ల ప్యాకేజీ చూపి ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మీ పార్టీలోకి ఆహ్వానించారు, సిగ్గులేదా? అంటూ టీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు.
చర్చకు సిద్ధం : కడియం
దీనిపై ఎంపీ కడియం శ్రీహరి సాయంత్రం 5 గంటలకు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టకపోతే ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డికి మంత్రులు కావాలనే కోరిక ఉందన్నారు.