సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ మరణాలపై లెక్కలు తేల్చి ఒకట్రెండ్రోజుల్లో సమగ్ర నివేదికను తనకు అందివ్వాలని వైద్యాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు కొనసాగుతున్నా సంబంధిత వైద్యాధికారులకు ఆ ఘోష వినపడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం గురువారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ గోప్యంగా ఉంచింది. కొద్దిపాటి వివరాలనే బయటకు వెల్లడించింది. కానీ, ఆ సమావేశంలో డెంగీ మరణాలపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఇద్దరే డెంగీతో చనిపోయారంటూ అధికారులు మంత్రినే తప్పుదోవ పట్టించడంతో ఈటల వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో ఒకే కుటుంబంలో నలుగురు డెంగీతో చనిపోయినా ఆ విషయం మీకు తెలియదా అని నిలదీశారు. కొందరు డెంగీతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా చనిపోయారని వైద్యాధికారులు చెప్పడానికి ప్రయత్నించగా మంత్రి తీవ్రస్థాయిలో క్లాస్ తీసుకున్నారు. ‘ఏదైనా చెబితే కాస్తంతైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఎంతోమంది చనిపోతుంటే కేవలం ఇద్దరే అని చెప్పడం హాస్యాస్పదమ’ని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో చివరకు 52 నుంచి 57 మంది డెంగీతో చనిపోయారని అధికారులు అంగీకరించినట్లు తెలిసింది.
డెంగీ మరణాలపై వేసిన కమిటీ ఏం చేసింది?
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీశ్రీనగర్‌లో ఒకే కుటుంబంలో నలుగురు డెంగీతో చనిపోయిన ఘటనపై ఆ జిల్లా వైద్యాధికారితో ఈటల మాట్లాడారు. ఘటనపై నివేదికను అందజేయాలని వైద్యాధికారుల్ని కోరారు. ‘డెంగీతోనే వారు చనిపోయి నట్లు అక్కడి వైద్యాధికారులు చెబుతుంటే మీరు మాత్రం ఇప్పటికీ ఇద్దరే అంటున్నార’ని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ మరణాలపై నిర్ధారణకు నెలన్నర క్రితం వేసిన కమిటీ ఏం తేల్చిందని ఆయన అధికారులను నిలదీశారు. అయితే ఆ కమిటీ ఇప్పటివరకు ఏ పురోగతి సాధించలేదని తెలిసింది.
15 వేలకు పైగా డెంగీ కేసులు నమోదు
రాష్ట్రంలో డెంగీ కేసులు 15 వేలకు పైగా నమోదైనట్లు, అందులో దాదాపు 150 మంది వరకు చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. అయితే డెంగీ మరణాలపై ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని అధికారులను మంత్రి హెచ్చరించినట్లు తెలిసింది. డెంగీ నివారణకు సరైన చర్యలు తీసుకోకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అన్నట్లు సమాచారం.
నల్లగొండ మెడికల్ కాలేజీకి స్థల సేకరణ
నల్లగొండ మెడికల్ కాలేజీ నిర్మాణానికి స్థల సేకరణ జరపాలని మంత్రి ఈటల ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ జిల్లా ఆస్పత్రిలోనే మెడికల్ కాలేజీ నడుస్తున్నందున వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 300 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని అధికారులు కోరగా, ఇప్పుడు సాధ్యం కాదని ఉన్నవారిని హేతుబద్దీకరించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీలు సిబ్బంది లేక మూతపడి ఉన్నాయని, వాటిని వైద్య విధాన పరిషత్‌కు అప్పగించే విషయం లోనూ చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment