సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి ఇంటివద్దే చికిత్స అందించాలని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అవి అమలు చేస్తే గాంధీ ఆసుపత్రిలో ఉండే వారి సంఖ్య మరింత తగ్గిపోతుందన్నారు. అయితే అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పని చేసే వారి మీద మరింత భారం పడనుందని ఈటల వివరించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటల శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా వారితో సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా, వైద్య విద్య సంచాల కులు డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాల కులు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొ న్నారు. గత 2 నెలలుగా నిద్రాహారాలు మాని కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషి వల్లనే తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అలా అని ఏ ఒక్కరూ రిలాక్స్ అవ్వొద్దని సూచించారు.
ప్రతీ వెయ్యి మందికి ఒక ఆశ వర్కర్...
ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ వర్కర్ లేదా ఏఎన్ ఎంలను ఏర్పాటు చేశామని, ఒక్కొక్కరికి వంద ఇళ్ల బాధ్యత అప్పగించామని జిల్లా అధికారులు మంత్రికి తెలిపారు. వీరందరూ రోజూ వారికి కేటాయించిన ఇళ్లను సందర్శించి థర్మో స్కానర్ ద్వారా ప్రతి ఒక్కరి ఉష్ణోగ్రత పరీక్ష చేస్తార న్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలించి, ఉంటే వారికి పరీక్షలు చేయిస్తారని మంత్రికి వివరించారు. వీరందరూ సరిగా పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా జిల్లాల అధికారులదేనని మంత్రి ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు కంటైన్మెంట్ ప్రాంతంలో ఉంటే కరోనా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వస్తే పరీక్షల కోసం తిప్పి ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన గర్భిణి మరణించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. కరోనా వల్ల వ్యాక్సిన్ వేసే శాతం తగ్గిందని, ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సిన్లు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం కరోనా మీద పని చేసిందని, ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో మిగిలిన శాఖలన్నీ వాటి పనుల్లో మునిగిపోతాయన్నారు. కాబట్టి వైద్య, ఆరోగ్యశాఖ మీద భారం పెరుగుతుందని మంత్రి ఈటల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment