మామూలు వాళ్ల కంటే హిజ్రాలే నయం!!
మామూలు వారికంటే తామే నయమని చాటుకున్నారు కొంతమంది హిజ్రాలు. పురిటినొప్పులతో తోటి మహిళ బాధపడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా మిగిలిన మహిళలు వదిలేస్తే.. హిజ్రాలు మాత్రం పెద్దరికం వహించి ఆమెను ఆదుకుని.. పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. సికింద్రాబాద్ నుంచి లక్నో వెళ్తున్న సికింద్రాబాద్ - గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండో జనరల్ బోగీలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ బాధను భరించలేక ఆమె నరకాన్ని అనుభవించింది.
తోటి ప్రయాణికులు గుడ్లప్పగించి చూశారే తప్ప.. ఏ ఒక్కరూ సహాయం అందించడానికి ముందుకు రాలేదు. అదే సమయానికి ఆ రైల్లో కొంతమంది హిజ్రాలు భిక్షాటన చేసుకుంటున్నారు. మహిళ పడుతున్న బాధను చూసి.. వెంటనే భిక్షాటన వదిలిపెట్టి అంతా ఒక్కటయ్యారు. తామే అడ్డుగా నిలబడి, ఆమెకు పురుడు పోశారు. బొడ్డు కోసి బిడ్డకు ప్రాణం పోశారు. అంతటితో ఆగలేదు... అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి పంపించారు. తమలోనూ మానవత్వం ఉందని, అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పందించగలమని చాటుకున్నారు.