
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లిని చట్ట ప్రకారం నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. అన్ని గ్రామాల్లో కచ్చితంగా వివాహాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా పంచాయతీలకు డీపీవోలు సర్క్యులర్ పంపారు. వివాహాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ‘పంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసి అందుబాటులో ఉంచాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. మీ–సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలి’అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
దశాబ్దాలు గడుస్తున్నా..
బాల్య వివాహాలను అరికట్టడం, వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. కానీ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివాహాల నమోదులో ఆశించిన పురోగతి లేదు. ఇప్పటివరకు వివాహాల రిజిస్ట్రేషన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనో.. తహసీల్దార్ కార్యాలయాల్లోనో నమోదయ్యేవి. తాజాగా పంచాయతీ స్థాయిలో ధ్రువీకరిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. అయినా పెద్దగా పురోగతి లేకపోవడంతో వివాహాల రిజిస్ట్రేషన్‌తో అనేక రకాల ఉపయోగాలున్నాయని ప్రచారం చేస్తూ గ్రామాల్లో నమోదు పెంచాలని పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment