తెలంగాణకే ‘జైపూర్’ | every vat of energy witch will be produced at jaipur thermal power station belongs to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకే ‘జైపూర్’

Published Tue, Jan 19 2016 4:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

తెలంగాణకే ‘జైపూర్’ - Sakshi

తెలంగాణకే ‘జైపూర్’

- 1,200 మెగావాట్ల ‘సింగరేణి’ విద్యుత్ పూర్తిగా రాష్ట్రానికే
- ఉమ్మడి ఏపీ ట్రాన్స్‌కోతో పాత ఒప్పందం రద్దు
- సింగరేణి, తెలంగాణ డిస్కంల మధ్య కొత్త ఒప్పందం
- ఎన్టీపీసీ రామగుండంతో ‘1,600 మెగావాట్ల’కు మరో ఒప్పందం
- సీఎం కేసీఆర్ సమక్షంలో ఒప్పందాలకు శ్రీకారం
 
సాక్షి, హైదరాబాద్:
ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మిస్తున్న 1,200 (2x600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్ క్రయవిక్రయాల కోసం సింగరేణి సంస్థ, ఉమ్మడి ఏపీ ట్రాన్స్‌కో మధ్య గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విద్యుత్ కేంద్రం నుంచి పూర్తి విద్యుత్ రాష్ట్రానికే దక్కేలా తెలంగాణ ట్రాన్స్‌కో, సింగరేణి మధ్య కొత్త ఒప్పందం కుదిరింది.

అలాగే కరీంనగర్ జిల్లా రామగుండంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ 1,600 (2x800) మెగావాట్లతో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్ క్రయావిక్రయాల కోసం ఎన్టీపీసీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మధ్య మరో ఒప్పందం కుదిరింది. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టి.ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, సింగరేణి  సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌తో.. ఎన్టీపీసీ జనరల్ మేనేజర్లు సి.వి. ఆనంద్, ఎస్.కె ఖర్, అడిషనల్ జనరల్ మేనేజర్ కె.సుదర్శన్‌లతో సంబంధిత ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, వెంకట నారాయణ, ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

ఈ ఒప్పందాలు కుదరడంతో సింగరేణి నుంచి 1,200 మెగావాట్లు, ఎన్టీపీసీ నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలైన టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లు కొనుగోలు చేయనున్నాయి. ఒప్పందం మేరకు సింగరేణి విద్యుత్ ధరలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ), ఎన్టీపీసీ విద్యుత్ ధరను కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (సీఈఆర్‌సీ)లు నిర్ణయించనున్నాయి. మార్చిలోగా జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఇప్పటికే సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది.

తెలంగాణ విద్యుత్ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. తొలి విడత కింద ఇప్పటికే ఎన్టీపీసీ 1,600 (2ఁ800) మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవలే ప్రారంభించగా.. దీనికి సంబంధించిన విద్యుత్ కొనుగోళ్ల కోసమే తాజాగా ఒప్పందం కుదిరింది.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి, నిర్మాణ దశల్లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 53.89 శాతం వాటా తెలంగాణకు, 46.11 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. సింగరేణి యాజమాన్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో మధ్య 2011లో జరిగిన జైపూర్ ప్రాజెక్టుకు సంబంధించిన పీపీఏ అమలైతే ఈ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 646 మెగావాట్లు, ఏపీకి 553 మెగవాట్లు సరఫరా చేయాల్సి వచ్చేది.

అయితే రాష్ట్ర విభజన తొలినాళ్లలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు కృష్ణపట్నం నుంచి  రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. నిర్మాణ దశలో ఉన్న కృష్ణపట్నం, హిందుజా, భూపాలపల్లి, జైపూర్ తదితర ప్రాజెక్టుల పీపీఏలను ఉమ్మడి రాష్ట్ర ఈఆర్‌సీ పెండింగ్‌లో ఉంచడంతో ఈ పీపీఏలు చెల్లవని అప్పట్లో ఏపీ వాదించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జైపూర్ విద్యుత్‌కు సంబంధించి ఉమ్మడి ఏపీ ట్రాన్స్‌కోతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకుని తాజాగా కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement