సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో త్వరలోనే పన్నెండు కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో ఆరు భూగర్భగనులు, మరో ఆరు ఉపరితల గనులని వెల్లడించారు. వచ్చే డిసెంబర్‌లో ఒక గనిని తాను స్వయంగా ప్రారంభిస్తానని చెప్పారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణిలో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సభ్యులు సోమారపు సత్యనారాయణ, పుట్టా మధు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.
సింగరేణిలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు వీలుగా రెండు మూడు చోట్ల నైపుణ్యాభివృద్ధికి కేంద్రాల (స్కిల్ డెవలప్‌మెంట్ యూనిట్)ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీలును బట్టి ఓ కేంద్రాన్ని తానే ప్రారంభిస్తానన్నారు. సింగరేణిలో 12 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామని, ఇప్పటికే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నామని తెలిపారు. దినదిన గండంగా పనిచేసే కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరానని, ఎస్సీ వ ర్గీకరణపై ప్రధాని మోదీని అఖిలపక్షం కలిసే సమయంలో ఈ విషయాన్ని కూడా చర్చిస్తామని తెలిపారు.
3న ఎంబీసీల అభ్యున్నతిపై చర్చ
ఎంబీసీల అభివృద్ధి అంశంపై వచ్చే నెల 3న బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కొందరు కడు పేదరికంలో ఉన్నారని చెప్పారు. త్వరలో బీసీ కార్పొరేషన్ ఇవ్వబోయే సమగ్ర వివరాలతో డిసెంబర్ 3న బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం‡ ప్రకటించారు. ఎంబీసీల సంక్షేమం కోసం మంచి సూచనలు ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment