తెగ తాగేస్తున్నారు..
జిల్లాలో గుక్కెడు మంచినీటికి కరువు ఉందేమో కాని మద్యానికి లేదు. ఊరు, పట్టణం అని తేడాలేకుండా మద్యం ఏరులై పారుతోంది. మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. మద్యం ప్రియులు తెగ తాగేస్తుండడంతో సర్కారు ఖజానా నిండుతోంది. వరుసగా వచ్చిన ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు.
నిజామాబాద్ క్రైం : జిల్లాలో మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు. నాలుగేళ్లలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం జరిగింది. గత మార్చి నెల నుంచి మే వరకు జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. పైగా మే నెలలో రికార్డు స్థాయిలో రూ. 57.90 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆంక్షలు లేకుంటే ఇంకా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగి ఉండేవి.
ఏటా పెరుగుతున్న అమ్మకాలు...
జిల్లాలో మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో (2009-10) మధ్య జిల్లాలో రూ. 253.13 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మే 2014 వరకు మద్యం అమ్మకాలు రూ. 494.51 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి మద్యాన్ని ఏ విధంగా తాగేస్తున్నారో అర్థమవుతోంది. 2009 -10లో రూ. 253.13 కోట్లు, 2010-11లో రూ. 296.55 కోట్లు, 2011-12లో రూ. 329.86 కోట్లు, 2012-13లో రూ. 396.40 కోట్లు, 2013 -14(జూన్ 2013 నుంచి మే నెల 2014 వరకు) రూ. 494.51 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జూన్ నెలలో కనీసం రూ. 65 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యాపారులకు షాకిచ్చిన ఈసీ...
ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావటంతో మద్యం అమ్మకాలతో అందినకాడికి సొమ్ము చేసుకుందామని అనుకున్న వ్యాపారులకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఈసారి మద్యం రహిత ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినట్లే చేసి చూపించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి మద్యం విక్రయాలపై ఆంక్షలు పెరిగాయి. గతేడాది ఏ నెలలో ఎంత మద్యం అమ్మకాలు జరిపారో ఈ సంవత్సరం అంతే మద్యం దుకాణాలకు కేటాయించారు. దీంతో మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. కొన్ని దుకాణాల్లో మద్యం స్టాక్ లేకపోవటంతో మూసి ఉంచుకున్నారు. లేకుంటే మద్యం అమ్మకాలు ఇంకా బాగా జరిగేవి. అయినప్పటికీ కొందరు వ్యాపారులు మహారాష్ట్ర,కర్ణాటల రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తెప్పించి దందా సాగించారు. ఈనెల 30 నాటికి మద్యం దుకాణాల లెసైన్స్ కాల పరిమితి పూర్తవుతుండగా, జూలై ఒకటి నుంచి కొత్త టెండర్లు రానున్నాయి.
పాత పాలసే ...
టెండర్ విధానానికి స్వస్తి చెబుతూ జనాభా ప్రకారం ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. 2013-14లో 142 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో 17 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. మిగిలిన 125 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన దుకాణాలకు డ్రా తీసి దుకాణాలు కేటాయించారు. దరఖాస్తుకు రూ. 25 వేల చలానాగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించరు. గతేడాది మిగిలి పోయిన దుకాణాలకు తిరిగి టెండర్లు నిర్వహించటంతో ఐదు దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 130 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన మూడు దుకాణాలకు తిరిగి టెండర్లు నిర్వహించనున్నారు. ఈ ఏడాది వచ్చిన 993 దరఖాస్తుల ద్వారానే ఎక్సైజ్ శాఖకు రూ. 2.32 కోట్ల ఆదాయం సమకూరింది.