‘అందరి’ కల.. ఉన్నత విద్య
- బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో సొంతం
వివిధ కారణాలతో ఉన్నత విద్యకు దూరమైన వారికి ఆ విశ్వవిద్యాలయం ఓ ఆశాకిరణం. వివిధ ప్రాంతాల్లో ఉండే వారు సైతం అక్కడే ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించే బృహత్తరమైన అవకాశాన్ని ఆ వర్సిటీ కల్పించింది. అదే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దేశంలోనే మొట్టమొదటి సారిగా దూరవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన అంబేద్కర్ విశ్వవిద్యాలయం మంగళవారం 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ప్రగతిపై ప్రత్యేక కథనం.
బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా 1982వ సంవత్సరం ఆగస్టు 26న విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట లెజిస్లేచర్ చట్టం కింద యూజీసీ గుర్తింపు కూడా లభించింది. 1982 ఆగస్టు 26న నాగార్జున సాగర్ వద్ద అప్పటి రాష్ట్రపతి జ్ఞానిజైల్‌సింగ్ ఈ వర్సిటీని ప్రారంభించారు. 1991 అక్టోబర్ 26న ఈ వర్సిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు.
జూబ్లీహిల్స్‌లో క్యాంపస్‌ను 1986 జూన్ 1న నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారంభించారు. 53.63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయం చుట్టూ రాళ్లు, చెట్లు, చెరువు ప్రకృతి సౌందర్యంతో అలరారుతోది. పది కోర్సులో ప్రారంభమైన ఈ వర్సిటీ ప్రస్తుతం పలు విభాగాల్లో 70 కోర్సులను అందిస్తోంది. ఏటా లక్ష మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 23 ప్రాంతీయ కేంద్రాల ద్వారా 216 స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న గృహిణులు, రైతులు, కార్మికులు, పోలీసులు, ఖైదీలు ఇలా అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ యూనివర్సిటీ కే దక్కింది. సెంట్రల్ జైళ్లలో కూడా ఈ విశ్వవిద్యాలయం ద్వారా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ఖైదీలకు విద్యను అందిస్తున్నారు.
చర్లపల్లి, వరంగల్, రాజమండ్రి, వైఎస్సార్ జిల్లా (కడప), నెల్లూరు కేంద్ర కారాగారాల్లో అధ్యాయన కేంద్రాలను ఏర్పాటు చేసి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్, ఊర్దూ భాషల్లో కోర్సులను అందిస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చారు. వర్సిటీ ఈ ఏడాది సీఎస్‌ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేక పేరొందిన విద్యాసంస్థలతో వివిధ కోర్సుల్లో ఎంఓయూ కుదుర్చుకుంది.
అతి తక్కువ ఫీజులు
తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఫీజు రూ. 1300, రెండు, మూడవ సంవత్సర ఫీజులు రూ. 1500 వసూలు చేస్తూ ఇందులోనే స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారు.
నేడు వ్యవస్థాప దినోత్సవం
యూనివర్సిటీ 33వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ ఇంచార్జ్ వైస్ చాన్సలర్ వికాస్ రాజ్ అధ్యక్షతన వ్యవస్థాపక వేడుకలు జరగనున్నాయి. రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనే అం శంపై వ్యవస్థాపక లెక్చర్‌ను కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ సంచాలకులు మురళీమనోహర్ ఇవ్వనున్నారు.