సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా...తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు రాంమాధవ్ మంగళవారం అరుణ నివాసానికి వెళ్లి ఆమెతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఢిల్లీ వెళ్లి రాత్రి 1 వరకు చర్చలు జరిపారు. అనంతరం పా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు మహబూబ్‌నగర్ సీటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీలో చేరిన సోయం బాపురావు...
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో బాపురావు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పాలన చూసే బాపురావు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు మోదీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. బాపురావు బీజేపీలో చేరడంతో ఆయనకు ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చే అవకాశముంది. మరోవైపు మహబూబ్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలను వివరణ కోరగా ఇంకా సమయం ఉంది కదా.. అని పేర్కొన్నారు. మరిన్ని చేరికలు ఉండొచ్చని వెల్లడించారు.
మరో 8 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా
మొదటి విడతలో 9 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి తీసుకెళ్లిన బీజేపీ రాష్ట్ర నేతలు మంగళవారం మరో 8 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపారు. మంగళవారం లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ కోర్ కమిటీ సమావేశం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను ఎంపిక చేసి హస్తినకు పంపించారు. ముందుగా తీసుకెళ్లిన జాబితాలోనూ కొన్ని పేర్లను మార్పు చేసి పంపించినట్లు తెలిసింది.
నేడు బీజేపీ అభ్యర్థుల జాబితా!
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. మంగళవారమే అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రకటన వెలువడలేదు. పార్టీలోకి వచ్చే నేతలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశం, గెలుపు గుర్రాలను బరిలో నిలపాలన్న ఆలోచనతో అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఒక్క స్థానం మినహా మిగతా స్థానాలు ఖరారు కావడం, టీఆర్‌ఎస్ ఈనెల 21న అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూడాలా వద్దా అని ఆ పార్టీ ఆలోచిస్తోంది. టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కనివారికి, గెలిచే అవకాశం ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా స్థానాల్లో తమ సత్తా చాటాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అప్పటివరకు వేచి చూసే అవకాశాలు ఉన్నాయి.
దాదాపుగా ఖరారైన అభ్యర్థులు..
సికింద్రాబాద్ – జి.కిషన్‌రెడ్డి; మెదక్ – రఘునందన్‌రావు; భువనగిరి – శ్యాంసుందర్; నాగర్‌కర్నూల్ – బంగారు శ్రుతి; మహబూబ్‌నగర్ – శాంతకుమార్/కొత్తవారికి అవకాశం; ఆదిలాబాద్ – సోయం బాపురావ్; నిజామాబాద్ – ధర్మపురి అరవింద్; కరీంనగర్ – బండి సంజయ్; పెద్దపల్లి – కాసిపేట లింగయ్య; చేవెళ్ల – జనార్దన్‌రెడ్డి; జహీరాబాద్ – సోమాయప్ప; వరంగల్ – చింతా సాంబమూర్తి; మహబూబాబాద్ – హుస్సేన్ నాయక్; నల్లగొండ – శ్రీధర్; హైదరాబాద్ – అమర్‌సింగ్; మల్కాజిగిరి – రాంచంద్రరావు; ఖమ్మం – వాసుదేవ్.
Comments
Please login to add a commentAdd a comment