
హైదరాబాద్: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తనపై నమోదు చేసిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ శ్రీధర్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ షమీమ్ అక్తర్ విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించారు. అయితే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో న్యాయమూర్తి కేసును సోమవారానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేశారు. సోమవారమే ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తానని న్యాయమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment