'తూర్పు’లో విషాదం | Ex-manchiryal municipal chairman krishma rao dies in road accident | Sakshi
Sakshi News home page

'తూర్పు’లో విషాదం

Published Mon, Feb 9 2015 4:47 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM

'తూర్పు’లో విషాదం - Sakshi

'తూర్పు’లో విషాదం

రోడ్డు ప్రమాదంలో  మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణారావు దుర్మరణం
* గాయాలతో బయటపడిన సతీమణి
* మెదక్ జిల్లాలో దుర్ఘటన
* రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన కృష్ణారావు...
* మున్సిపల్ చైర్మన్‌గా మూడు సార్లు
* భౌతికకాయం వద్ద ప్రజాప్రతినిధుల నివాళి


మంచిర్యాల టౌన్ : తూర్పు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా క్రీయాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు(63) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన సతీమణి, 18వ వార్డు కౌన్సిలర్ మంజుల చేయి విరిగింది. గాయాలతో ఆమె హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కారు డ్రైవర్ ప్రభాకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో మంచిర్యాలకు తిరిగి వస్తుండగా మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో ఎదురు గా వస్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కృష్ణారావు అక్కడికక్కడే మృతిచెందారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన మరణం రాజకీయ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
అంచెలంచెలుగా ఎదిగిన కృష్ణారావు
మంచిర్యాల మండలం నస్పూర్ గ్రామంలో 1952 నవంబర్ 12న జన్మించిన కృష్ణారావు వ్యాపార, రాజకీ య రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1972-73లో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. యూనియన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1981లో శ్రీవెంకటేశ్వర సినిమా టాకీస్‌లో మేనేజర్‌గా పనిచేసిన ఆయన అదే సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది.. 1981 నుంచి 1986 వరకు కౌన్సిలర్‌గా కొనసాగారు. 1987లో జరిగిన మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారిగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

1995లో రెండోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది.. పరోక్ష ఎన్నికల్లో తిరిగి మూడోసారి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. 2010 మంచిర్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అరవిందరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎంపీ వివేక్ అనుచరుడిగా ఉన్న ఆయన వివేక్‌తో కలిసి  కాంగ్రెస్‌ను విడిచిన టీఆర్‌ఎస్‌లో చేరా రు. తిరిగి వివేక్ కాంగ్రెస్ గూటికి చేరినా ఆయన టీఆర్ ఎస్‌లోనే కొనసాగుతున్నారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ మహిళ రిజర్వేషన్ కావడంతో 18వ వార్డు నుంచి ఆయన భార్య మంజులను నిలబెట్టి గెలిపించు కున్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేయడం కోసం  వ్యుహరచన చేసినా సాధ్యం కాలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వెనక్కితగ్గారు. రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణారావుకు అన్ని పార్టీల నా యకుల అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. అప్పట్లో రాజమండ్రి, హైదరాబాద్‌లోని ముషిరాబాద్ జైలు జీవితం గడిపారు. కాగా, కృష్ణారావు, మంజుల దంపతులకు కుమారుడు సత్యనారాయణ, కూతురు హిమబిందు ఉన్నారు. సత్యనారాయణ యూరప్‌లోని స్పెయిన్‌లో ఎంఎస్, కూతురు హైదరాబాద్‌లో బీడీఎస్ చదువుతున్నారు. సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
పలు కీలక పదవుల్లో..
కృష్ణారావు తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులు నిర్వహించారు. చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ మున్సిపల్ చైర్మన్‌గా ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా 15 ఏళ్లు పదవిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కోశాధికారి బాధ్యతలు నిర్వర్తించారు. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జిల్లా సాంస్కృతిక సమాఖ్య ముఖ్య సలహాదారుడిగా కొనసాగుతున్నారు.  
 
కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్యే, చైర్‌పర్సన్
పట్టణవాసుల సందర్శనార్థం కృష్ణారావు భౌతికాయాన్ని స్థానిక వాటర్‌ట్యాంక్ చౌరస్తాలోని ఖాళీ స్థలంలో ఉంచారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సం ఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర కృష్ణారావు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

మాజీ ఎంపీ జి.వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, కిషన్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగీలాల్ సోమాని, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సుదమల్ల హరి కృష్ణ, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బుద్దార్థి రాంచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, మాజీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్‌గౌడ్, బీజేపీ నాయకుడు కె.వి.ప్రతాప్, నాయకులు మామిడిశెట్టి రమేశ్, పురప్రముఖులు మోటూరి నారాయణ, గుండా సుధాకర్, జుగల్‌కిషోర్‌వ్యాస్, పురుషోత్తంజాజు, మున్సిపల్ కమీషనర్లు తేజావత వెంకన్న, త్రయంబకేశ్వర్‌రావు, సీఐ వి.సురేశ్, ఎస్సైలు నివాళులు అర్పించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement