తలసాని నీతులు చెప్పడమా?
మాజీ ఎంపీ మధుయాష్కీ
హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తలసాని టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో చేరిన తెలంగాణద్రోహి అని, ప్రాజెక్టులకు అడ్డుపడొద్దంటూ ఆయన కూడా తెలంగాణవాదులకు నీతులు చెబితే అర్థం ఏముందని మాజీ ఎంపీ మధుయాష్కీ మండిపడ్డారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమసమయంలో తెలంగాణవాదులపై దాడి చేసిన తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన అరాచకాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. తలసాని అవినీతిని బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఏ ఒక్క కుటుంబమూ అభివృద్ధి చెందలేదన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ అంతా సీఎం కేసీఆర్ కుటుంబమే మింగేసిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో ఎత్తు పెంచడం, జనాన్ని ముంచడం, డబ్బులు దోచుకోవడమే టీఆర్‌ఎస్ పాలనలోని అసలు గుట్టు అని అన్నారు.
కడియం, లక్ష్మారెడ్డిని తప్పించాలి: మహేశ్
ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులైన మంత్రులు కడియం శ్రీహరి, సి.లక్ష్మారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుం బానికి దగ్గరగా ఉండే వ్యక్తుల ద్వారా ఎంసెట్ లీకేజీలో దాదాపు రూ.200 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు.