ఎగ్జిబిట్.. రెడీమేడ్!
- ఒక్కోదానికి రూ.3 వేల ధర
- సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
- తరగతి గదులకే పరిమితమవుతున్న విద్యార్థుల సృజనాత్మకత
- చోద్యం చూస్తున్న అధికారులు
హన్మకొండ చౌరస్తా : మార్కెట్‌లో నిత్యావసర వస్తువులు.. కూరగాయలు.. ఏదేని వస్తువును కొనుక్కోవచ్చు. కానీ, విద్యార్థులు తయారు చేసి.. ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించే ఎగ్జిబిట్లు కూడా ఇప్పుడు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. ఈ దందాను సాక్షాత్తు ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడే నిర్వహిస్తూ దండుకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి ప్రతి నెల వేలాది రూపాయల వేతనం తీసుకుంటూ అదనపు సంపాదనకు కోసం అర్రులు చాస్తున్నాడు. సదరు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆరోపణలు వెల్లువెత్తినా.. అధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.
రెడీమేడ్ ఎగ్జిబిట్ల రంగ ప్రవేశంతో విద్యార్థుల సృజనాత్మకత తరగతి గదులకే పరిమితమవుతున్న క్రమంలో ఇలాంటి దందాతో విద్యార్థుల సృజనాత్మ శక్తి అంతరించిపోయే ప్రమాదం ఉందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో ఇన్‌స్పైర్-2014ను దశలవారీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయ్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇన్‌స్పైర్‌లో ఎగ్జిబిట్లు ప్రదర్శించవచ్చు. కాగా, ఎగ్జిబిట్‌ను రూపొందిం చేందుకు ప్రభుత్వం ఆయా పాఠశాలలకు చెందిన ప్రతి విద్యార్థికి రూ. 5వేలు అందజేస్తుంది.
ఇందులో రూ. 2,500 ఎగ్జిబిట్‌ను తయారు చేసేం దుకు కావాల్సిన ముడిసరుకు కోసం, మరో రూ. 2500లు ప్రయాణ, ఇతర ఖర్చులకు చెల్లిస్తుంది. అయితే విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టి వారిని ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయులు.. పాఠశాల నుంచి ఏవో ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తే చాలనుకుని విద్యార్థులకు తెలియకుండానే రెడీమేడ్‌గా ఎగ్జిబిట్లను తయారు చేయించి ప్రదర్శనలో ఉంచుతుండడం గమనార్హం.
ఎగ్జిబిట్లను అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు
ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో వి ధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెడీమెడ్ ఎగ్జిబిట్లను తయారుచేసి అమ్ముతున్నాడు. హన్మకొండ జులైవాడలోని ఆయన ఇల్లును ఏకం గా ఎగ్జిబిట్లు తయారుచేసే కుటీర పరిశ్రమగా మా ర్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఎగ్జిబిట్ల తయారీకి డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులను కూలీలుగా పెట్టుకున్నాడు. కాగా, సదరు ఉపాధ్యాయుడు ఒక్కో ఎగ్జిబిట్‌ను రూ. 3000 చొప్పున విఖ్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా, ఎగ్జిబిట్లను కొనుగోలు చేసేందుకు మన జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ నుంచి వస్తున్నారంటే అతడి వ్యాపారం ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై సదరు ఉపాధ్యాయుడిని వివరణ కోరితే... ‘నా ఇంటిపైన ఎగ్జిబిట్లను తయారు చేసి అమ్ముతున్న మాట వాస్తవమే. వాటికీ.. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎగ్జిబిట్ల తయారీకి గైడ్‌గా వ్యవహరించాలని కొందరు విద్యార్థులు కోరితే సరేనన్నా. అయినా... ఎగ్జిబిట్లను తయారు చేసే వారందరూ డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులే. చదువుకుంటూ ఉపాధి పొందడంలో తప్పేముంది.’ అని సమాధానమిచ్చాడు.