పెట్టుబడి ఎట్లా.. | Extends half of loans | Sakshi
Sakshi News home page

పెట్టుబడి ఎట్లా..

Published Sat, Jun 14 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

పెట్టుబడి ఎట్లా..

పెట్టుబడి ఎట్లా..

  •  రైతన్నకు రుణాల గుబులు
  •  బోణీకొట్టని ఖరీఫ్ రుణ ప్రణాళిక
  •  కొత్తవి ఇచ్చేందుకు బ్యాంకర్ల విముఖత
  •  పాత రుణాల మాఫీకి లింకు
  •  ముంచుకొస్తున్న సాగు కాలం
  •  ప్రైవేట్ అప్పులవైపు రైతుల చూపు
  • వరంగల్ : రైతు రుణాలను రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ అమలులో  జాప్యం.. కొత్త రుణాల మంజూరుకు గుదిబండగా మారింది. ఖరీఫ్ రుణాలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ బ్యాంకర్లలో సానుకూల స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రుణమాఫీపై బ్యాంకర్లకు స్పష్టత లేకుండా కొత్త రుణాలిచ్చే అవకాశం లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు ఆవేదన చెందుతున్నారు.

    ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం కేసీఆర్ శాసనసభలో శుక్రవారం తేల్చిచెప్పారు. అరుుతే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, విధి విధానాలు, నిబంధనలు బ్యాంకర్లకు చేరాల్సి ఉంది. వీటికి ఎంత గడువు తీసుకుంటారు? ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఆధారపడే రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. ఈ సంశయం  రైతులను తొలుస్తున్నది. హామీ అమలైతే జిల్లాలో రూ.1200 కోట్ల మేరకు రుణాలు మాఫీ అవుతాయని, 2లక్షల 50వేల మంది రైతులకు రుణభారం తొలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
     
    బోణీకొట్టని రుణప్రణాళిక
     
    ఈ ఏడాది రైతు రుణ ప్రణాళికను లీడ్‌బ్యాంక్ ప్రకటించినప్పటికీ జిల్లాలో ఎక్కడా ఇంకా రుణాల మంజూరు ప్రారంభం కాలేదు. సీజన్ పూర్తయిన తర్వాత రుణాలు మంజూరు చేయడం వల్ల ప్రయోజనం లేదు. రుణమాఫీకి, రుణ మంజూరుకు బ్యాంకర్లు లింక్‌పెడుతున్నందున రైతులకు పాలుపోవడంలేదు. 2014 -15 వార్షిక ప్రణాళికలో పంట రుణాలు రూ.2100 కోట్లుగా నిర్ణయించారు. టర్మ్‌లోన్ రూ.233.20కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగానికి రూ.308 కోట్లుగా నిర్ణయించారు.

    వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కిషన్ బ్యాంకర్లను కోరారు. రుణ ప్రణాళిక ఈ నెల ప్రారంభం నుంచి అమలు కావాల్సి ఉండగా ఏ బ్యాంకులోనూ ఈ జాడ కన్పించడం లేదు. ప్రభుత్వం రుణమాఫీపై గందరగోళానికి తెరదించితేనే కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ హామీ మేరకు రూ.లక్ష రుణం మాఫీపై బ్యాంకుల వారీగా పూర్తి స్థాయి లెక్కలు తీస్తున్నట్లు లీడ్‌బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ తెలిపారు.
     
    పెట్టుబడి కోసం దిగులు
     
    ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి దిగులు పట్టుకున్నది. సర్కార్ రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తుంది...తిరిగి కొత్త అప్పులకు అవకాశం కల్పిస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ చేస్తే అప్పుల భారం పోయి, కొత్త రుణంతో పెట్టుబడికి ఇబ్బందులుండవని భావించిన రైతులకు ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    ఈ స్థితిలో రుణమాఫీ, కొత్త రుణాలపై జాప్యం చేస్తే సాగుకు సమస్యలు తలెత్తుతాయంటున్నారు. పెట్టుబడి కోసం ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, కరెంట్ కోతలు, వడగళ్ళతో రైతులు గత ఖరీఫ్, మొన్నటి రబీలో తీవ్రంగా నష్టపోయారు. ఆదాయంతో పాటు పెట్టుబడి సైతం నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement