గుర్తుల గుబులు | Extends marks in elections | Sakshi
Sakshi News home page

గుర్తుల గుబులు

Published Tue, Mar 18 2014 2:14 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

గుర్తుల గుబులు - Sakshi

గుర్తుల గుబులు

 మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉపసంహరణ ఘట్టం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటన, వెనువెంటనే గుర్తుల కేటాయింపు ఉంటుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల అధికారికి బీ-ఫారం సమర్పిస్తే ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు.
 
  ఇక స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ జారీ చేసిన గుర్తులను కేటాయిస్తారు. గుర్తులు కూడా విజయావకాశాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో ఎలాంటి గుర్తు వస్తుందోనని అభ్యర్థులు గుబులు చెందుతున్నారు. ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి మొదటగా చూసేది గుర్తునే. అభ్యర్థుల పేరు చూసి ఓటు వేసే వారు తక్కువగా ఉంటారు.
 
 స్వతంత్రులకు టెన్షన్
 నిన్నటి వరకు ఫలానా పార్టీ నుంచి టిక్కెట్ వస్తుందని గంపెడాశతో ఉన్న ఆశావహులకు టిక్కెట్ అందని ద్రాక్షగా మారడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు అభ్యర్థులు స్వతంత్రంగా ఎన్నికల్లో దిగుతూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు.
 
 అయితే గుర్తుల విషయానికి వచ్చే సరికి కలవర పడుతున్నారు. ఏ గుర్తు వస్తుందో ఏమో అని బెంగ పెట్టుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం కంటే గుర్తు కోసం కంటిమీద కునుకు పట్టడం లేదు. ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమో, గుర్తు కలిసి రావడం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నారు. ప్రజలకు సులువుగా గుర్తుండే గుర్తులు ఉంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా ఉంటుంది.
 
 గత పురపాలక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులైన రాంచందర్, కాసర్ల శ్రీనివాస్ కప్పు సాసర్ గుర్తుపై విజయం సాధించారు. ప్రతి ఇంట్లో ఉదయం టీ తాగేది కప్పుసాసర్లలోనే. అందుకే ఆ గుర్తు ఈజీగా ఓటర్ల మదిలో ఠ మొదటి పేజీ తరువాయి
 ఉండిపోయాయి. అంటే ఎన్నికల్లో గుర్తులు అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. స్వతంత్రులు తమకు అనుకూలమైన గుర్తు రావాలని ఆరాటపడుతున్నారు.
 
 మున్సిపాలిటీల్లో 82 గుర్తులు
 ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ పార్టీల గుర్తులను మినహాయించి స్వతంత్ర అభ్యర్థుల కోసం 82 గుర్తులు కేటాయించింది. అందులో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ అనంతరం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లను ఆకట్టుకునే గుర్తులు ఉన్నాయి. కప్పు సాసర్, గౌను, గ్యాస్‌పొయ్యి, బీరువా, ఆటో, బెల్ట్, క్యారమ్ బోర్డు, కేక్, ఇస్త్రీపెట్టే, కుండ గుర్తులు సులువుగా గుర్తిండి పోతాయి.
 
  అందుకే ఆ గుర్తుల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇటీవల ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ చీపురు గుర్తుకు క్రేజీ పెరిగింది. చీపురు గుర్తు కావాలంటూ చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు.
 
 ఈ గుర్తులతో పరేషాన్
 ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులు కొన్ని అభ్యర్థులను ఆకట్టుకుంటుండగా మరికొన్ని దడ పుట్టిస్తున్నాయి. షేవింగ్ రేజర్, రంపం, టేబుల్ ల్యాంప్, వయోలిన్, కాలిఫ్లవర్, క్యాలిక్‌లేటర్, డీజిల్ పంపు, పల్లకి, మంచం, కోటు, కవర్, గరాటా, హార్మోనియం, టెంట్, కత్తి, కటింగ్ ప్లేయర్ గుర్తులు ఉన్నాయి.
 
 ఈ గుర్తులు చెప్పుకోవడానికి కూడా నోరు తిరగడం లేదని స్వతంత్ర అభ్యర్థులు పేర్కొంటున్నారు.  కోరిన గుర్తు రాకున్నా మంచిదే కాని ప్రచారం చేయలేనటువంటి, ఓటర్లు గుర్తుంచుకోలేని గుర్తులు రావద్దు దేవుడా అంటూ వేడుకుంటున్నారు.
 గుర్తులను ఇలా కేటాయిస్తారు..
 స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం అనివార్యమని భావించే వారు నామినేషన్ దాఖలు సందర్భంగా నాకు ఫలానా గుర్తు కావాలని మూడు గుర్తుల్లో ఏదో ఒకటి కోరాలి.
 
 ఒకవేళ అభ్యర్థులు నామినేషన్ పత్రంలో కోరకపోతే ఎన్నికల సంఘం అధికారులకు గుర్తులను కేటాయించే అధికారం ఉంది. ఏవైనా గుర్తులకు పోటీ ఏర్పడితే నామినేషన్ పత్రంలో పేరు, ఇంటి పేరు ఆధారంగా ఆంగ్ల అక్షరమాల ప్రకారం గుర్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన కేటాయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement