'డబుల్' ఇళ్లు మరో 5 వేలు
♦ అదనపు ఇళ్లు సీఎం కోటాకు పరిమితం
♦ అవసరమైన నియోజకవర్గాలకు మంజూరు చేయనున్న కేసీఆర్
♦ ఇప్పటికే ఖమ్మంకు 1600 మంజూరు
♦ ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టబోయే ఇళ్ల సంఖ్య 65వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం నిర్మించబోయే ఇళ్ల సంఖ్య తాజాగా మరింత పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం 60 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ సంఖ్యను 65 వేలకు పెంచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనికి ఆమోద ముద్ర వేశారు. అయితే, అదనంగా వచ్చి చేరిన ఈ ఐదువేల ఇళ్లు ముఖ్యమంత్రి కోటాలో భాగంగా రిజర్వ్‌లో ఉంటాయి. వాటిని సీఎం వివిధ నియోజకవర్గాలకు స్వయంగా కేటాయిస్తారు. ఆ కోటాలో ఇప్పటివరకు 12,400 ఇళ్లు ఉండగా, కొత్తగా చేరిన వాటితో కలసి ఆ సంఖ్య 17,400కు చేరింది.
సీఎం పర్యటనలు... కొత్త మంజూరీలు..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఏ ప్రాంతంలో పర్యటించినా కొన్ని వరాలు ఇవ్వడం సహజంగా మారింది. పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు వీలైనన్ని రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తున్నారు. నియోజకవర్గానికి 400 చొప్పున ఇప్పటికే గంపగుత్తగా ఇళ్లు మంజూరయ్యాయి. సీఎం వరాలు దానికి అదనంగా పరిగణించాల్సి వస్తోంది. కొందరు మంత్రులూ తమ జిల్లాకు పాత కేటాయింపులు సరిపోవని, అదనంగా ఇళ్లు కావాలని కోరుతున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల నుంచి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో వారి అభ్యర్థన మేరకు సీఎం అదనపు కేటాయింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తొలుత సీఎం కోటా కింద ఉంచిన ఇళ్లు సరిపోయే పరిస్థితి లేదు. కొద్దిరోజుల క్రితం ఒక్క ఖమ్మం జిల్లాకే 1,600 ఇళ్లను ఆయన అదనంగా మంజూరు చేశారు. త్వరలో నగర పాలక ఎన్నికలు జరుగనున్న ఖమ్మం, వరంగల్‌లకు అదనంగా ఇళ్లను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రకరకాల అవసరాల కోసం అదనంగా మరో ఐదు వేల ఇళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.