కరోనా: అపోహలూ... వాస్తవాలు | Facts And Myths Awareness on Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా: అపోహలూ... వాస్తవాలు

Published Thu, Apr 2 2020 8:07 AM | Last Updated on Thu, Apr 2 2020 8:16 PM

Facts And Myths Awareness on Coronavirus - Sakshi

కరోనా వైరస్‌ ప్రబలిన నాటి నుంచి చాలా రకాల అపోహలు మన ప్రజల్లో, మన సమాజంలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మి చాలామంది నష్టపోతున్నారు. అందుకే కరోనా వైరస్‌కు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలను దూరం చేసుకుని, వాస్తవ అవగాహన పెంచుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం.

అపోహ: ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు దగ్గు, తుమ్ములు వస్తూ, ముక్కుకారడమూ జరుగుతోందనుకోండి. అది కరోనా వైరస్‌ వల్ల వచ్చే ‘కోవిడ్‌–19’ వల్లనేనా? వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందేనా?

వాస్తవం: దగ్గు, తుమ్ములూ, ముక్కుకారడం వంటి లక్షణాలు చూడగానే భయపడాల్సిన అవసరమేమీ లేదు. అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు మనకు దగ్గు, తుమ్ములతో పాటు ముక్కు కారడం కూడా ఉందనుకోండి. సాధారణ జలుబే అందుకు కారణం కావచ్చు. అలాగే అకస్మాత్తుగా దగ్గు రావడమో లేదా తుమ్ములొస్తూ కాసేపు కొనసాగాయనుకుందాం. అందుకు కారణం... బయటి వాతావరణంలో ఏవైనా కాలుష్య కణాలు ముక్కులోకి వెళ్లడం వల్ల ఇలా జరగవచ్చు. ఇక దగ్గు, తుమ్ములు, ముక్కుకారడంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లంతా నిస్సత్తువ ఉన్నాయనుకోండి. అది సాధారణ ఫ్లూ వల్ల కూడా కావచ్చు. ఇక మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే... దగ్గు, తుమ్ములూ, ఒళ్లునొప్పులు, తీవ్రమైన నిస్సత్తువ/నీరసంతో పాటు 101.5 లేదా 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతతో జ్వరం ఉండి, ఊపిరి అందకుండా ఆయాసం వస్తుందనుకోండి. అది ప్రమాదం అని గ్రహించి వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఇది మినహా పైన పేర్కొన్న ఇతర లక్షణాలు కనిపిస్తే... కుటుంబ సభ్యులందరిని నుంచి దూరంగా ఉంటూ, మీ వస్తువులను ఎవరూ వాడకుండా చూసుకుంటూ, ఇంట్లోనే ఐసోలేషన్‌ పాటించాలి. బయటకు ఏమాత్రం రాకూడదు. అప్రమత్తత అవసరమే గానీ... ఆందోళన పడాల్సిన అవసరం లేదని గుర్తించండి. పైగా ఆందోళన వల్ల వ్యాధి నిరోధక శక్తీ తగ్గవచ్చు.

అపోహ: దగ్గు తుమ్ముల విషయానికి వస్తే... ఇంతగా ధైర్యం చెబుతున్నారు కదా. మరి ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతే ఎందుకింత కంగారు? సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు కూడా తాత్కాలికంగా వాసనలు తెలియవు కదా?

వాస్తవం:  మొట్టమొదట పేర్కొన్న ‘అపోహ–వాస్తవం’లో దగ్గు, తుమ్ముల విషయంలో ధైర్యం చెప్పిన మాట వాస్తవమే. అయితే సాధారణ జలుబులోనూ ముక్కుకారుతూ... వాసనలు తెలియకపోవడమూ నిజమే. ఇక్కడ కరోనా వైరస్‌తో వచ్చే ఇన్ఫెక్షన్‌లో ముక్కు కారకుండానే వాసనలూ తెలియడం లేదంటే... దాన్ని తప్పక ‘కోవిడ్‌–19’గా అనుమానించాలి. అదయ్యేందుకే అవకాశాలెక్కువ.

అపోహ: శానిటైజర్‌ వైరస్‌లనూ, వ్యాధి కలగజేసే ఇతర సూక్ష్మక్రిములనూ చంపేంత శక్తిమంతమైనది కదా? మరి అలా ప్రతి రెండు గంటలకోసారి పూసుకోవడం వల్ల... దాని కారణంగా చేతులకు ఏదైనా ప్రమాదమా? అది దేహంపైనా, ముఖంపైనా అంటుకోవడం వల్ల ఏదైనా ముప్పు ఉంటుందా?
వాస్తవం: మన చేతులపై ఉన్న వ్యాధికారక సూక్ష్మక్రిములూ, వైరస్‌లను  ప్రభావవంతంగా నిర్మూలించేందుకే శానిటైజర్‌ను వాడుతున్నాం. అంత వరకు అది శక్తిమంతమైనదే. కానీ ప్రతి రెండు గంటలకోమారు మళ్లీ పూసుకొమ్మని డాక్టర్లు సలహా ఇస్తున్నారంటే... రెండు గంటల తర్వాత దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుందనే కదా. అందుకే... దానివల్ల చేతులకు గానీ... అది శరీరంలోని ఇతర చోట్ల అంటుకోవడం వల్లగాని ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కాకపోతే పొరబాటునగానీ... లేదా ఉద్దేశపూర్వకంగా గానీ తాగితే మాత్రం చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి.

అపోహ:శానిటైజర్‌ పూసుకుని వంటింట్లో స్టవ్‌ దగ్గరకు వెళ్లకూడదట కదా. వెళ్తే చేతులు కాలిపోయే ప్రమాదం ఉందట కదా?
వాస్తవం: శానిటైజర్‌లో ఆల్కహాల్‌ పాళ్లు దాదాపు 65 నుంచి 70 శాతం వరకు ఉంటాయి. ఆల్కహాల్‌కు స్పిరిట్‌లాగే అంటుకుపోయి మండే గుణం ఉన్న మాట వాస్తవమే. శానిటైజర్‌ చేతులకు పూసుకున్న తర్వాత వెంటనే స్టవ్‌ దగ్గరకు వెళ్లకుండా... అది ఆరిపోయాక నిస్సందేహంగా, నిక్షేపంగా స్టవ్‌ దగ్గర వంట చేసుకోవచ్చు. పైగా ఆల్కహాల్‌కు చాలా త్వరగా ఆవిరైపోయి, ఆరిపోయే (వోలటైల్‌)గుణం  ఉంటుంది. కాబట్టి వెంటనే అరిపోతుంది. అలా ఆరిపోగానే ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా హాయిగా వంట చేసుకోవచ్చు.

అపోహ:మనం రోజూ అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మజాతికి చెందిన పండ్లు తింటే ఈ జబ్బు దరిచేరదని చాలా మంది అంటున్నారు.
వాస్తవం: ఇప్పటికి కరోనా వైరస్‌ కారణంగా వచ్చే ‘కోవిడ్‌–19’ జబ్బుకు నిర్దిష్టంగా మందుగానీ, వ్యాక్సిన్‌గానీ లేవు. ఇక అల్లం, వెల్లుల్లి, ఉల్లి విషయానికి వస్తే వీటిల్లో చాలా ఔషధ గుణాలున్నమాట నిజమే. అలాగే నిమ్మజాతి పండ్లలోని విటమిన్‌ ‘సి’ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగే మాట కూడా వాస్తవమే. అంతమాత్రాన వీటిని తీసుకుంటే కరోనా వైరస్‌ దరిచేరదన్నది పూర్తిగా వాస్తవం కాదు. ఉల్లి, వెల్లుల్లిలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అలాగే అల్లంలో జింజెరాల్‌ అనే చాలా చురుకైన జీవరసాయనం... వాపు, నొప్పి, మంట వంటి వాటిని వేగంగా తగ్గించి, గాయాలను త్వరగా మానేలా చేస్తుంది.  దానిలోని యాంటీ–ఆక్సిడెంట్స్‌ ఎన్నో క్యాన్సర్లను నివారిస్తాయి. అలాగే నిమ్మలోని విటమిన్‌–సి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కానీ... నేరుగా విటమిన్‌–సి ఒక్కటే వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించలేదు. దానికి విటమిన్‌–డి, జింక్‌ వంటి మరికొన్ని మైక్రోన్యూట్రియెంట్‌ల సహాయం కూడా కావాలి. అందుకే అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మ లేదా నిమ్మజాతి పండ్లు నేరుగా వైరస్‌ను నివారించలేవు. మన వ్యాధి నిరోధక శక్తి ద్వారా పరోక్షంగా మాత్రమే నివారించేదుకు సహాయ పడతాయి. అందుకే ప్రతిరోజూ అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మజాతి పండ్లు ఆహారంలో తీసుకుంటున్నాం కదా అని జాగ్రత్తగా ఉండకపోతే... వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కేవలం ఇలాంటి వంటింటి చిట్కావైద్యాలపై ఆధారపడి నిర్లక్ష్యంగా ఉండకూడదు.

అపోహ:మన దేశంలోగానీ... రాష్ట్రాల్లో గానీ అవసరమైనన్ని టెస్టింగ్‌ కిట్లు లేకపోవడం వల్ల అందరికీ పరీక్షలు జరపకపోవడం వల్లనే మన దగ్గర రోగుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోందని చాలామంది అంటున్నారు కదా?
వాస్తవం: చాలామందిలో ఈ అపోహ ఉంటుంది. ప్రజలు కంగారు పడతారేమోనని (ప్యానిక్‌ అవుతారేమోనని) రోగుల సంఖ్య, మృతుల సంఖ్య దాస్తున్నారని కొందరు అపోహ పడుతుంటారు. ప్యానిక్‌ కావడాన్ని నివారించడం కోసమే పరీక్షలు చేయడం కూడా చేయడం లేదని అనుకుంటుంటుంటారు. కొందరు కేవలం అనుమానంతోనే తమకు అవసరం లేకపోయినా  పరీక్షలు చేయించుకోడానికి వస్తుంటారు. వీళ్లందరికీ ఈ కథనంలోని మొట్టమొదటి అపోహ, దానికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకుంటే చాలు. మనకు దగ్గు, తుమ్ములూ, జ్వరం వచ్చిన ప్రతిసారీ అది కరోనా వైరస్‌ కారణంగా కాదనే కొన్ని సందేహాలు తీరిపోతాయి. ఇక మనం ముందుగా పేర్కొన్న కారణాల వల్లనే పరీక్షలు కూడా ప్రతి ఒక్కరికీ జరపాల్సిన అవసరం లేదు.

లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉండి, అది ‘కోవిడ్‌–19’ వల్ల కావచ్చనే అనుమానం ఉన్నప్పుడూ, లేదా వ్యాధి విపరీతంగా వ్యాపించిన ఢిల్లీ వంటి ప్రాంతాల్లోకి వెళ్లివచ్చిన వారూ, విదేశాలకు వెళ్లివచ్చిన వారి విషయంలోనే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ వ్యాప్తి ఎక్కువ కాబట్టి ఆ జాగ్రత తీసుకోవడం అవసరం. ఇక పరీక్షలు జరపకుండా ఉంటూ, కేసుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారనేది అంత సబబైన వాదన కాదనేందుకు ఒక తార్కాణం ఉంది. మనం రోగుల సంఖ్యను దాచినా... మరణాలనైతే దాచలేం కదా. కానీ ఇప్పటివరకూ కరోనా పాకిన ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాలు చాలా తక్కువే కదా. అందువల్ల పరీక్షలు జరపకుండా, రోగుల సంఖ్యను తగ్గిస్తున్నారనే విషయంలో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కరోనా విషయంలో చాలా గట్టిగా, అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం కూడా నిత్యం అప్రమత్తంగా ఉంటూ, సమయానుగుణంగా తగు చర్యలను తీసుకుంటోంది.

అపోహ:చిన్నపిల్లల్లో ఇది ఏమాత్రం ప్రభావం చూపదట కదా? అలాంటప్పుడు వాళ్ల విషయంలోనూ మరీ అంతంత జాగ్రత్తగా ఉండాలా?
వాస్తవం: ఓ వయసు దాటిన వృద్ధులతో పోలిస్తే... చిన్నపిల్లలపై కరోనా అంతగా ప్రభావం చూపడం లేదన్నది కొంతవరకు మాత్రమే వాస్తవం. కానీ చాలామంది చిన్నపిల్లలపైన కూడా కరోనా తన ప్రభావం చూపింది. వ్యాధి నిరోక శక్తి చాలా తక్కువగా ఉన్నందున కొందరు చిన్నారులు చైనాలో చనిపోయారు కూడా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. చిన్నపిల్లల విషయంలో దీని ప్రభావం అంతగా లేదనే అంశాన్ని పట్టుకుని తల్లిదండ్రులు వాళ్ల పట్ల నిర్లక్ష్యంగా ఏమాత్రమూ ఉండకూడదు. ఎందుకంటే... వాళ్లకు సోకిన వైరస్‌ కొంత మైల్డ్‌గానే ఉన్నా... చిన్నారుల నుంచి మన ఇంటిలోని పెద్దవారికే అది సోకిందనుకోండి. మరి పెద్దవాళ్లలో అది తీవ్రప్రభావం చూపుతోంది కదా. అందుకే ఇళ్లలోని పెద్దవారి కోసమైనా సరే... వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైగా పిల్లలతో మనందరికీ చాలా ఉద్వేగభరితమైన సంబంధం (ఎమోషనల్‌ బాండింగ్‌) ఉంటుంది. వాళ్లకు ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేం. వాళ్లకు పూర్తిగా తగ్గుతుందనుకున్నా... ఊపిరి అందక వాళ్లు ఆయాసపడుతుంటే మనం ఎంతమాత్రమూ చూడలేం. హాస్పిటల్‌లో వాళ్లు ఉన్నప్పుడు దగ్గరికి పోకుండా మనల్ని మనం నియంత్రించుకోలేం. కాబట్టి పిల్లల పట్ల కూడా చాలా అప్రమత్తంగా,   జాగ్రత్తగా ఉండాలి.

అపోహ:ప్రస్తుతం ఇది అంతగా పాకడం లేదట కదా. అలాంటప్పుడు ఇప్పుడున్న లాక్‌డౌన్‌ను ఇంతే కఠినంగా పాటించాలా? కాస్త రిలాక్స్‌డ్‌గా ఉండవచ్చు కదా?!
వాస్తవం: ఒక అంచనా ప్రకారం... మనం మంచి ఆహారం, మంచి వ్యక్తిగత పరిశుభ్రత వంటి జాగ్రత్తలు పాటిస్తూనే... లాక్‌డౌన్‌ వంటివి ఏమీ లేకుండా ఉన్నామనుకోండి. ఇప్పుడీ వైరస్‌ పాకుతున్న వేగాన్ని బట్టి చూస్తే... లాక్‌డౌన్‌ గనక లేకపోతే ప్రతి వారంలో వ్యాధి సోకిన వారి సంఖ్య ఉజ్జాయింపుగా రెట్టింపడుతుందనుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు సమాజంలో కేవలం 100 మంది రోగులే ఉన్నారనుకుందాం. కేవలం 10 వారాల్లోనే వారి సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ఇక లక్ష నుంచి 10 లక్షలకు చేరడానికి కేవలం మూడు వారాలు చాలు. అంటే మన దగ్గర 100 మంది రోగులు ఉంటే... కేవలం 12 – 14 వారాల్లో అంటే మూడునెలల్లో వారి సంఖ్య పదిలక్షల వరకు చేరుతుంది. ఇంతమందికి చికిత్స చేసేటన్ని వనరులు మనకు ఉన్నాయా? ఇలా ఆలోచించి చూడండి. లాక్‌డౌన్‌ ఎంత అవసరమో ఎవరికి వారికే అర్థమవుతుంది.

అపోహ: బిడ్డ ఎక్కడో గర్భసంచిలో ఉంటాడు కాబట్టి... గర్భంతో ఉన్న మహిళ ద్వారా పుట్టబోయే చిన్నారులకూ ఈ వైరస్‌ సోకే ఆస్కారం ఉండదేమో కదా?
వాస్తవం: ఉంది. చైనా లోని వూహాన్‌ నగరంలో ప్రసవానికి సంసిద్ధంగా ఉన్న కొందరు మహిళలపై అధ్యయనం జరిపారు. ప్రసవం జరిగిన 30 గంటలలోపు చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా... కొందరు బిడ్డలకు ‘కోవిడ్‌–19’ సోకిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి కడుపులో ఉండగానే తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకవచ్చని తేలింది.

అపోహ: చంటిబిడ్డ కేవలం చనుబాలు మాత్రమే తాగుతాడు కాబట్టి... బిడ్డకు పాలిచ్చే మహిళకు కరోనా వైరస్‌ సోకితే, అది చనుబాల ద్వారా చిన్నారికీ సోకే అవకాశం ఉండకపోవచ్చేమో కదా.
వాస్తవం: పూర్తిగా రాదని చెప్పలేకపోవచ్చుగానీ... రావడానికైతే ఆస్కారం కొంత ఎక్కువే ఉంది. అందుకే అటు ప్రసవానికి సంసిద్ధంగా ఉన్న మహిళలు గానీ... ఇటు బాలెంతలు మొదలుకొని చనుబాలిచ్చే మహిళలంతా చాలా జాగ్రత్తగా ఉంటూ, తమకు వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన అన్నిరకాల జాగ్రత్తలనూ తీసుకోవాల్సిందే.

డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావుమేనేజింగ్‌ డైరెక్టర్,చీఫ్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్,కిమ్స్‌హాస్పిటల్స్, సికింద్రాబాద్‌
డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌సూపరింటెండెంట్, ప్రొఫెసర్‌ – హెచ్‌ఓడి పల్ములరీ మెడిసిన్, ఉస్మానియా మెడికల్‌ కాలేజి అండ్‌ గవర్నమెంట్‌ జనరల్‌ – చెస్ట్‌ హాస్పిటల్,ఎర్రగడ్డ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement