
సమావేశంలో వివరాలు తెలియజేస్తున్న రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు తదితరులు
సాక్షి, నాగోలు: భూమిలో బంగారం దొరికిందని అమాయకులకు నకిలీ బంగారం అంటగట్టి మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని ఒకరిని అరెస్ట్ చేశారు. ఇత్తడిని పుత్తడిగా చేసి మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న పోరాచ గ్యాంగ్‌లోని ప్రధాన నిందుతుడిని అరెస్ట్ చేసి బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి నిందుతుడి నుంచి 3కేజీల నకిలీ బంగారం, రూ.6 లక్షల, 7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
శనివారం ఎల్‌బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన షణ్ముఖ బల్లారి(25) జల్సాలకు అలవాటు పడి అదే ప్రాంతానికి చెందిన నాగరాజు, భరతేష్, అనిల్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.
వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని మొదట నిజమైన బంగారం చూపించి, తక్కువ ధరకే లభిస్తుందని నమ్మించి వెండి ఆభరణాలకు బంగారం పూత పూసి నమ్మించి వారికి అమ్ముతుంటారు. బాలాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ ద్వారా పరిచయం చేసుకుని సంప్రదించి తాను పాత ఇల్లు ఉంటే కూల్చివేశామని అక్కడ పాత బంగారం బిందె దొరికిందని నమ్మించారు.
నమ్మిన శ్రీనివాసరెడ్డి వారికి మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఇతనికి నకిలీ బంగారం అంటగట్టారు. నగరానకి వచ్చి బంగారాన్ని చెక్ చేసుకోగా నకిలీవని తేలింది. నకిలీ బంగారం కొనుగోలు చేసి మోసపోయానని గుర్తించిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠాపై నిఘా ఉంచి ముఠాలోని ప్రధాన నిందితుడైన షణ్ముఖ్ భల్లారిని అరెస్టు చేసి నకిలీ బంగారం, నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, బాలాపూర్ సీఐ సైదులు, అదనపు సీఐ సుధీర్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment