టీఎస్09 ఎఫ్‌బీ 9999... ఈ నెంబర్‌కు రవాణాశాఖ నిర్ణయించిన ఫీజు రూ.50వేలు. కానీ ఇటీవల నిర్వహించిన వేలంలో దీనికి అనూహ్యమైన పోటీ ఏర్పడింది. 10మంది వాహనదారులు రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. ఒక వాహనదారుడు ఏకంగా రూ.9.25లక్షలు చెల్లించి ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఒక్క నెంబర్ మాత్రమే కాదు... నచ్చిన నెంబర్ కోసం వాహనదారులు ఎంత చెల్లించేందుకైనా వెనుకాడడం లేదు. ఒక్కో నెంబర్ కోసం కనీసం 5 నుంచి 10మంది పోటీ పడుతున్నారు. నాలుగైదేళ్ల క్రితం పెద్దగా ఆదరణ లేని నెంబర్‌లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల నిర్వహించిన వేలంలోనే టీఎస్09 ఎఫ్‌సీ 0001 నెంబర్ కోసం ఒక సంస్థ రూ.6.66లక్షలు చెల్లించింది. అలాగే టీఎస్09 ఎఫ్‌సీ 0005 నెంబర్ కోసం స్పేస్ టైమ్ ఇంటీరియర్ అనే మరో సంస్థ రూ.5.06 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్‌లపై వేలంపాటలు నిర్వహించిన ప్రతిసారి ఆర్టీఏకు దాదాపు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. సంఖ్యాశాస్త్రంపై, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నెంబర్‌లతో అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఈ మేరకు ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు ఇదే ఆర్టీఏకు ఆదాయాన్నిస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ఆల్‌నైన్స్ నెంబర్ టీఎస్09 ఈఎల్ 9999 కోసం సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.10.50లక్షలు చెల్లించాడు. అన్ని రకాల ప్రత్యేక నెంబర్‌లపై నిర్వహించే వేలంపాటలతో ఆర్టీఏకు ప్రతిఏటా రూ.25కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా. ఒక్క ఖైరతాబాద్ కార్యాలయంలోనే కాదు.. నగరంలోని అన్ని చోట్ల ప్రత్యేక నెంబర్‌లకు ఎంతో క్రేజ్ ఉంది. లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసిన వారు తమకు నచ్చిన నెంబర్ కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు.
వీటికే డిమాండ్...
9, 1, 999, 9999, 786, 6, 666, 1111 తదితర నెంబర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక్క ‘ఆల్‌నైన్స్’ మాత్రమే కాదు... తమకు నచ్చిన నెంబర్‌ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఫ్యాన్సీ నెంబర్‌లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌లకు పోటీ బాగా ఉంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్‌క్రూజర్, ఆడి తదితర ఖరీదైన వాహనాలే కాదు... బైక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించిన వేలంపాటల్లో ఇలాంటి నెంబర్‌లపై సుమారు రూ.25 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’తో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే డిమాండ్ ఎక్కువగా ఉంది.
హోదా.. అదృష్టం
అదృష్ట సంఖ్యలుగా భావించే నెంబర్‌ల కోసం కొందరు పోటీకి దిగితే... సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు తదితర విభిన్న రంగాలకు చెందిన వాహన యజమానులు ‘లక్కీ’ నెంబర్‌ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్‌లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్‌లు ఉంటాయి. ఒక్కో నెంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది పోటీకి వస్తుండగా... నచ్చిన నెంబర్‌లు లభించని వాళ్లు 3 నెలల నుంచి 6నెలల వరకు కూడా పడిగాపులు కాయడం గమనార్హం. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నెంబర్‌లతో అదృష్టం బాగా కలిసొస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజీకి కారణమే. జ్యోతిషులు ఒక్కొక్క నెంబర్‌ను ఒక గ్రహంతో, వాటి కదలికలతో సరి చూసి భవిష్యత్తును, మానసిక స్వభావాలను అంచనా వేస్తారు. అలా తమ స్వభావానికి తగిన నెంబర్‌లను వాహనదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రకంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వంటి ప్రతి సింగిల్ నెంబర్‌కు ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంతస్వభావానాకి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివితేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ నెంబర్ వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరూ ఇష్టపడే నెంబర్ ‘9’. కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీ మనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నెం»బర్‌ను ఇష్టపడుతారు.
ఎన్టీఆర్‌తో ప్రారంభం...
మొదట్లో ఈ నెంబర్‌లకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు రూ.లక్షల్లో డిమాండ్ ఉన్న ‘9999’ వంటి నెంబర్లు రెండు దశాబ్దాల క్రితం రూ.వేలల్లో లభించేవి. 1980లలో అయితే కేవలం రూ.500లకు ఈ నెంబర్‌లను కేటాయించేవారు. ఎలాంటి పోటీ ఉండేది కాదు. రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్టీరామారావుతో ఈ నెంబర్‌కు క్రేజ్ వచ్చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ 27, 999, 9999 వంటి నెంబర్‌లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో అందరూ అదే బాటలో నడిచారు. బాగా డిమాండ్ పెరిగింది. ఆల్‌నైన్స్‌తో పాటు కొంతకాలంగా వాహనదారులు 6666 నెంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెంబర్‌ను తన అదృష్ట సంఖ్యగా భావించడంతో మిగతా వాహనదారులపైన ప్రభావం పడింది. దీంతో ఈ నెంబర్‌కు ప్రస్తుతం రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు పోటీ ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపార రంగ ప్రముఖులు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
నెంబర్లే బహుమతులు...
ఇటీవల కాలంలో చాలామంది వినియోగదారులు తమ కుటుంబసభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు... వారి పుట్టిన రోజు కలిసొచ్చే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్‌లను ఎంపిక చేసుకొని పోటీకి వస్తున్నారు. 1313 (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. 5121 అనే నెంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. 143, 214, 8045 వంటి నెంబర్‌లకు ఎంతో క్రేజీ ఉంది.
లగ్జరీ వాహనాలు పెరగడంతోనే...
గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నెంబర్‌లకు అనూహ్య స్పందన వస్తోంది. లగ్జరీ వాహనాల వినియోగం బాగా పెరగడం ఇందుకు కారణం. ప్రతిఏటా 10వేలకు పైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి వచ్చేస్తున్నాయి. అలాగే రూ.50లక్షల విలువైన బైక్‌లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వినియోగదారులు నెంబర్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. – పాండురంగ్‌నాయక్, జేటీసీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment